|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 06:22 PM
నాడు రజాకార్లతో పోరాడిన ఆయన.. కన్నకొడుకుల చేతిలో మాత్రం ఓడిపోయారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. 50 ఎకరాల భూమిని పంచి ఇచ్చినా.. కొడుకుల ఆప్యాయతను పొందలేకపోయారు. ఆయనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఉంగరాల యాదగిరి .
వలిగొండ గ్రామం కేశిపల్లికి చెందిన ఉంగరాల యాదగిరి(110) స్వాతంత్య్ర సమరయోధుడు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ తర్వాత సొంత గ్రామంలో 50 ఎకరాలను కష్టపడి సంపాదించుకున్నారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కూతుర్లు సంతానం. భార్య లక్ష్మమ్మ పదిహేనేళ్ల క్రితం కాలం చేశారు. ఆ తర్వాత తనకున్న 50 ఎకరాల్లో నలుగురికి కుమారులకు తలో 10 ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. మిగిలిన 10 ఎకరాల్లో కూతుళ్లకు చెరో ఐదెకరాల చొప్పున రాసిచ్చారు. కుమారుల ఇళ్ల నిర్మాణం కోసం రూ.25 లక్షలు కూడా ఇచ్చారు. అయితే ఆస్తులు పంచుకున్న తర్వాత కుమారులు యాదగిరిని పట్టించుకోవడం మానేశారు.
యాదగిరి ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా లాగేసుకొని.. ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో అనాథగా మారిన యాదగిరిని కుమార్తెలు ఉప్పల్‌లోని ఓ వృద్ధాశ్రమంలో చేర్పించారు. చాలా కాలంగా ఆయన అక్కడే ఉంటున్నారు. తనను పట్టించుకోకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్న కుమారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా సరే, ఆయన గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. తన పరిస్థితిని అర్థం చేసుకుని కుమారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని ఈ పెద్దాయన వేడుకుంటున్నారు. తన నుంచి తీసుకున్న 40 ఎకరాల భూమి తాను బతికి ఉన్నంత వరకు తనకే చెందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
యాదగిరి ఉదంతం ఒక్కటే కాదు.. ప్రస్తుత సమాజంలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయి. ఆస్తుల కోసం కన్నవారినే రోడ్డున పడేస్తున్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నమై, మనుషుల్లో వ్యక్తిగత స్వార్థం పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణమని మనస్తత్వ వేత్తలు చెబుతున్నారు.