|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 06:29 PM
పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా భోజనాలు ఘుమఘుమలాడుతూ ఉంటాయి. ఇక ఫంక్షన్ హాల్స్ అయితే నాన్‌స్టాప్‌గా ఈవెంట్లతో బిజీ బిజీగా ఉంటాయి. అయితే ఏ ఫంక్షన్ అయినా.. పిలిచిన వాళ్లు రావడం సర్వసాధారణమే. ఇక ఆ ఫంక్షన్‌కు సంబంధం లేకుండా.. ఆ ఫంక్షన్ నిర్వహించే వారికి సంబంధం లేకుండా.. కనీస ఆహ్వానం లేకుండా.. చాలా మంది వచ్చి ఫంక్షన్లలో తింటూ ఉంటారు. ఇలా కొన్నిసార్లు గొడవలు కూడా అయిన సందర్భాలు కూడా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన బోర్డు.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో ఆ బోర్డును చూసిన నెటిజన్లు కామెంట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ నందన్ ఫంక్షన్ హాల్ యాజమాన్యం.. ఫంక్షన్ హాల్ ముందు ఏర్పాటు చేసిన ఓ బోర్డు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ఫంక్షన్ హాల్‌లో జరిగే ఫంక్షన్‌కు సంబంధం లేని వ్యక్తులు దొరికినచో సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలు శిక్షతోపాటు.. రూ. 5 వేల జరిమానా విధిస్తామని రాసి ఉంది. దీంతో ఇప్పుడు ఆ బోర్డు సోషల్ మీడియలో తెగ వైరల్‌గా మారింది.
సెక్షన్ 441 అంటే ఏంటి. అది ఏం చెబుతోంది?
ఫంక్షన్‌కు సంబంధం లేని వ్యక్తులు రాకూడదు అంటూ బోర్డు పెట్టడం ఎక్కడైనా సర్వ సాధారణమే. అయితే అందులో సెక్షన్ 441 గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇప్పుడు తీవ్ర చర్చకు కారణం అయింది. దీంతో సెక్షన్ 441 అంటే ఏంటి. అందులో ఏముంది అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే భారత శిక్షాస్మృతి(ఐపీసీ) సెక్షన్ 441 ప్రకారం.. క్రిమినల్ ట్రెస్‌పాస్ (అక్రమ చొరబాటు)ను తెలుపుతుంది. అంటే ఒకరి అనుమతి లేకుండా వారి ప్రైవేట్ ఆస్తిలోకి ప్రవేశించడం చట్టరీత్యా నేరం అని అర్థం. ఈ సెక్షన్ కింద చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం సంబంధిత నిర్వాహకులకు ఉంటుంది. అందుకే పిలవని పేరంటాలకు భోజనాలకు వెళ్లి అక్కడ దొరికిపోతే చట్టపరంగా జైలు శిక్షతోపాటు జరిమానా చెల్లించాల్సి వస్తుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.