|
|
by Suryaa Desk | Wed, May 28, 2025, 06:39 PM
భూ యాజమాన్య హక్కులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేవలం రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు చేసుకున్నంత మాత్రాన ఆ భూమిపై ఎటువంటి హక్కు లేదా టైటిల్ సంక్రమించదని స్పష్టం చేసింది. భూమి వర్గీకరణ, పంటల స్వభావం, భూమి శిస్తు (పన్ను) ల కోసం మాత్రమే పహాణీలు లేదా ఇతర రెవెన్యూ ఎంట్రీలు ఉపయోగపడతాయని కోర్టు పేర్కొంది. రెవెన్యూ ఎంట్రీలను ఎప్పుడూ ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ ’గా భావించరాదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఈ తీర్పు ద్వారా తెలంగాణ హైకోర్టు రెవెన్యూ రికార్డుల ప్రామాణికతపై స్పష్టతనిచ్చింది. రెవెన్యూ రికార్డుల్లోని ఎంట్రీల వల్ల కొత్త హక్కులు సంక్రమించబోవని.. ఇప్పటికే ఉన్న హక్కులు హరించుకుపోవని కోర్టు వివరించింది. భూమిపై నిజమైన హక్కు ఎవరిది అనే విషయం కేవలం సంబంధిత సివిల్ కోర్టులోనే తేలుతుందని.. రెవెన్యూ అధికారులు జారీ చేసే పత్రాలు కేవలం పరిపాలనా ప్రయోజనాలకేనని హైకోర్టు నొక్కి చెప్పింది.
భూ వివాదాల పరిష్కారంలో సివిల్ కోర్టులదే అంతిమ నిర్ణయం అని ఈ తీర్పు తేటతెల్లం చేసింది. ఇది భూ వివాదాలను తగ్గించి.. పారదర్శకతను పెంచడంలో సహాయపడుతుంది. రెవెన్యూ అధికారులు కేవలం భూమి పన్ను వసూలు, సాగు వివరాలు వంటి వాటిని నమోదు చేయడానికి మాత్రమే అధికార పరిధిని కలిగి ఉంటారని ఈ తీర్పు స్పష్టం చేసింది.
హైకోర్టులో పిటిషన్ దాఖలు
పెద్దపల్లి జిల్లాలోని ఓదెల గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన 14.05 ఎకరాల భూమి వివాదానికి సంబంధించి ఈ తీర్పు వెలువడింది. 2018లో తమకు పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేసి.. ఆ తర్వాత తమ పేర్లను తొలగించడం చెల్లదని పేర్కొంటూ ఆలయ పూజారి ఆరుట్ల నర్సింహాచారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదంపై వాదనలు విన్న జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం.. ఈ వివాదాన్ని ఎండోమెంట్ ట్రిబ్యునల్లో తేల్చుకోవాలని సూచించింది.
ఈ కేసు ద్వారా.. ఆలయ భూములు లేదా దేవాదాయ ధర్మాదాయ సంస్థలకు సంబంధించిన భూ వివాదాలను సివిల్ కోర్టులకు బదులుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఎండోమెంట్ ట్రిబ్యునల్స్ పరిష్కరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది దేవాదాయ భూముల రక్షణకు, వాటి యాజమాన్య హక్కుల స్పష్టతకు దోహదపడుతుంది. ఈ తీర్పు భవిష్యత్తులో తెలంగాణలో తలెత్తే అనేక భూ వివాదాలకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. తద్వారా న్యాయవ్యవస్థపై భారం తగ్గి.. వేగవంతమైన పరిష్కారాలకు మార్గం సుగమం అవుతుంది.