|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 03:40 PM
ఖమ్మం నగరం 26వ డివిజన్ పరిధిలోని రామాలయం వద్ద గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు కార్తీక మాసం చివరి రోజున ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ గిఫ్ట్స్ & ఫ్యాన్సీ యజమానులు, పద్మశాలి యువజన కిరణం నాయకులు పంతంగి అశోక్, రేణుక దంపతులు ఈ సేవా కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించి బీద ప్రజలకు హృదయపూర్వకంగా భోజనం పంచిపెట్టారు. ఈ కార్యక్రమం ప్రాంతంలోని పేదలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డెబోయిన నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, దాతృత్వాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు. ఆయన ఆశోక్, రేణుక దంపతుల సేవా దృక్పథాన్ని అభినందించారు.
పంతంగి అశోక్, రేణుక మాట్లాడుతూ “కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన నెల. ఈ పవిత్ర మాసంలో అన్నదానం చేయడం వల్ల అపార పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మా చిన్న ప్రయత్నం ద్వారా బీదల ముఖంలో చిరునవ్వు చూడడమే మాకు అతి పెద్ద ఆశీస్సు” అని భావోద్వేగంతో తెలిపారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సేవకులు, నాయకులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రామాలయం పరిసరాలు భక్తి శ్రద్ధలతో నిండిపోయాయి. కార్తీక మాసం ఇలా అన్నదానంతో ముగియడం ప్రతి ఒక్కరికీ ఆదర్శవంతంగా నిలిచింది.