|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 01:38 PM
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక నివేదికను సమర్పించింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా సిఫారసు చేసింది. రిజర్వేషన్ల అంశాన్ని తేల్చడానికి ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా నివేదిక సమర్పించింది.డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఈ నెల 24వ తేదీలోపు ఎన్నికల తేదీలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో అదే రోజున విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24న హైకోర్టు విచారణకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.ఈ నెల 24 లేదా 25న షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో డిసెంబర్ 16 వరకు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది.