|
|
by Suryaa Desk | Sun, Mar 08, 2026, 05:59 PM
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారతజట్టు, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీలో బరిలోకి దిగిన టీమిండియా.. వరుసగా రెండోసారి టైటిల్ కొట్టి రికార్డు సృష్టించాలని పట్టుదలగా ఉంది. ఆతిథ్య దేశాలు ఇప్పటివరకూ టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న సందర్భాలు లేవు. ఈ లెక్కను సరిచేయాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఫైనల్‌లో తమ సత్తా చూపించి.. పొట్టికప్పు పట్టుపట్టాలని కివీస్ కదనరంగంలోకి దిగుతోంది. మొత్తంగా ఈ సూపర్ సండే.. క్రికెట్ అభిమానులకు మజాను పంచే ఫన్‌డే మారనుంది.
మరోవైపు టీ20 ప్రపంచకప్ ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కానుండగా.. భారతజట్టు ఫైనల్‌లో గెలవాలంటూ దేశవ్యాప్తంగా పూజలు, ప్రార్థనలు మొదలైపోయాయి. టీమిండియా కప్ గెలవాలని 140 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు. టీమిండియాకు ఆల్ ద బెస్ట్ చెప్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ప్రపంచకప్ ఫైనల్ ముందు టీమిండియా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. రెండు జట్లు, ఒక్కటే హార్ట్ బీట్ అంటూ కవిత చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
టూ టీమ్స్, వన్ హార్ట్‌బీట్ అంటే.. ఆ రెండూ జట్లు, భారత్, న్యూజిలాండ్ అని అనుకుంటే పొరబాటే. ప్రపంచకప్ ఫైనల్ ఆడుతున్న భారత క్రికెట్ జట్టుతో పాటుగా.. భారత మహిళల హాకీ జట్టుకు కూడా కవిత ఆల్ ద బెస్ట్ చెప్పారు, భారత క్రికెటర్లు తమ ప్రపంచకప్ టైటిల్ నిలబెట్టుకోవాలని.. అలాగే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఆడుతున్న భారత మహిళల హాకీ జట్టు కూడా విజయం సాధించాలని కవిత ఆకాంక్షించారు. హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత మహిళల జట్టు తన ప్రస్థానాన్ని నేటి నుంచి ( మార్చి 8) ప్రారంభించనుంది. హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే భారత క్రికెటర్లతో పాటుగ మహిళా హాకీ జట్టుకు కూడా కవిత ఆల్ ది బెస్ట్ చెప్పారు.
భారత మహిళల హాకీ జట్టు.. టోక్యో నుంచి ఆసియా కప్ వరకూ అద్వితీయ ప్రదర్శన కనబరిచారని.. వారేంటో రుజువు చేసుకున్నారని అన్నారు. ఈ రోజు 140 కోట్ల మంది భారతీయులు వారి వెంట ఉన్నారన్న కవిత.. నిర్భయంగా ఆడాలని కోరుకున్నారు. భారత క్రికెటర్లతో పాటుగా మైదానంలోని మన ఆడబిడ్డల కోసం కూడా వ్యాల్యూమ్ పెంచుదామంటూ కవిత ట్వీట్ చేశారు.