|
|
by Suryaa Desk | Sun, Mar 08, 2026, 06:16 PM
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అల్పాహార పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాంతో పాటుగా విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారంలో మూడు రోజుల పాటు పాలు అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గత నెల 26న విద్యాశాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించరు. ఈ సమీక్ష సందర్భంగా స్కూల్ విద్యార్థులకు పాలు కూడా అందించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు వారంలో మూడు రోజుల పాటు రాగి జావ అందిస్తున్నారు. మిగిలిన మూడు రోజుల పాటు విద్యార్థులకు పాలను సరఫరా చేయాలని విద్యాశాఖ ప్రతిపాదిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది విద్యార్థులున్నట్లు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వారందరికీ పాలు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కూడా బ్రేక్‌ఫాస్ట్ అమలు కానుంది. రాష్ట్రంలోని 430 జూనియర్ కాలేజీల్లో 1.80 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారికి కూడా పాలు అందిస్తారా? లేదా? అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. ఇంటర్ విద్యాశాఖ మాత్రం స్కూల్ విద్యార్థులకు అమలు చేసేవన్నీ తమకూ వర్తింపజేయాలని కోరుతోంది. దీనిపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.
ఇక తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ-స్కూల్స్‌గా మారుస్తూ వాటిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య రక్షణ కోసం 'ఆరోగ్య లక్ష్మి' పథకం ద్వారా ప్రతిరోజూ పౌష్టికాహారాన్ని అందిస్తోంది. 7 నెలల నుంచి 6 ఏళ్ల వరకు ఉన్న చిన్నారులకు పాలు, ఉడికించిన గుడ్లు, బాలామృతం, రుచికరమైన భోజనం అందిస్తున్నారు. గర్భిణులు బాలింతలకు రోజుకు ఒక పూట పూర్తి భోజనం (అన్నం, పప్పు, కూరగాయలు), 200 మి.లీ. పాలు, ప్రతిరోజూ ఒక గుడ్డు అందిస్తున్నారు. అదనంగా ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు, సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని సరఫరా చేస్తూ రక్తహీనత నివారణకు ప్రభుత్వం కృషి చేస్తోంది.