![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 05:51 AM
ఇవాళ సినిమాలకు సంబంధించిన సర్ ప్రైజెస్ అంటూ ఏమీ మిగలడం లేదు. చిత్ర బృందం కాస్తంత గోప్యత పాటించి, కొన్నింటిని దాచిపెట్టాలని చూసినా... ఏదో చోటు నుండి ఆ సమాచారం బయటకు వచ్చేస్తోంది. సినిమా అనేది వన్ మ్యాన్ షో కాదు. స్క్రిప్ట్ రాయడం నుండి విడుదల వరకూ వందలాది మంది పనిచేస్తుంటారు. కొన్ని విషయాలను ఎంత రహస్యంగా ఉంచాలని చూసినా అది సాధ్యమయ్యే పనికాదు. మూవీ కంటెంట్ ను సెల్ ఫోల్స్ లో తీయకుండా కొంతమేరకు నియంత్రించవచ్చేమో కానీ సమాచారాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. బట్... తాము గోప్యంగా ఉంచాలనుకున్నది బయటకు అనధికారికంగా వచ్చేనప్పుడు మేకర్స్ అప్ సెట్ కావడం సహజం.'హిట్' తో దర్శకుడిగా మారి చక్కని విజయాన్ని అందుకున్న డాక్టర్ శైలేష్ కొలను పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. 'హిట్' తర్వాత తీసిన'హిట్ 2' మూవీ కూడా చక్కని విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, రెండో సినిమాలో అడివి శేష్ చేశాడు. ఇప్పుడీ 'హిట్ 3'లో ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాని నటించాడు. మే 1న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. 'హిట్ 2' చివరిలోనే 'హిట్ 3' లో నాని నటించబోతున్నాడంటూ హిట్ ఇస్తూ ఓ సీన్ పెట్టారు. అది ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేసింది. ఇప్పుడు కూడా అలానే 'హిట్ 3' చివరిలో ఈ ఫ్రాంచైజ్ తర్వాతి భాగంలో తమిళ హీరో కార్తి నటించబోతున్నట్టుగా ఓ కీలక సన్నివేశాన్ని ఇటీవల అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. అయితే ఈ విషయాన్ని వీలైనంత వరకూ గోప్యంగా ఉంచాలని మేకర్స్ భావించారు. ఒక్కసారిగా కార్తిని తెర మీద చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారని అనుకున్నారు. కానీ వందలాది మంది పాల్గొనే షూటింగ్ వివరాలు బయటకు రాకుండా ఎలా ఉంటాయి!? 'హిట్ -3'లో కార్తీ చేస్తున్నాడనే న్యూస్ బయటకు వచ్చేసింది. దాంతో సోషల్ మీడియాలో దానిని కొందరు పోస్ట్ చేసేశారు.
Latest News