![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 10:33 AM
జియో హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. ఆ సిరీస్ పేరే 'టచ్ మీ నాట్'. గతంలో ఒకటి రెండు సినిమాలను తెరకెక్కించిన రమణతేజ, ఈ సిరీస్ కి దర్శకుడు. నవదీప్ - కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, 6 ఎపిసోడ్స్ గా 7 భాషల్లో ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ కి వచ్చింది. 'హీ ఈజ్ సైకో మెట్రిక్' అనే కొరియన్ సిరీస్ ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: హైదరాబాదులో 2009లో ఈ కథ మొదలవుతుంది. దీపావళి పండుగ కావడంతో 'మారుతి అపార్టుమెంటు'లో వాతావరణం చాలా సందడిగా ఉంటుంది. ఆ హడావిడిలోనే నలుగురు మహిళలను ఒక వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేస్తాడు. ఆ తర్వాత గ్యాస్ లీక్ చేసి, అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ ప్రమాదంలో రాఘవ్ (నవదీప్) తన తల్లిని కోల్పోతాడు. రిషి (దీక్షిత్ శెట్టి) తన తల్లిదండ్రులను కోల్పోతాడు. కాలచక్రంలో పదేళ్లు గడిచిపోతాయి. గతంలో జరిగిన ఆ ప్రమాదం నుంచి రిషిని కాపాడిన రాఘవ, పోలీస్ ఆఫీసర్ అవుతాడు. రిషిని కాలేజ్ లో చదివిస్తూ ఉంటాడు. అయితే గతంలో రిషి తలకి బలమైన గాయం కావడం వలన, అతనికి 'సైకో మెట్రి' అనే ఒక పవర్ వస్తుంది. అంటే మనుషులను గానీ .. ఏమైనా వస్తువులను గాని టచ్ చేసి, వాటికి సంబంధించిన వివరాలను చెప్పగలిగే శక్తి అతనికి వస్తుంది. ఆ స్కిల్ ను డెవలప్ చేసుకోమని అతణ్ణి రాఘవ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. కాలేజ్ లో రిషికి మేఘ ( కోమలి ప్రసాద్) పరిచయమవుతుంది. ఆమె కూడా మారుతి అపార్టుమెంటు బాధితురాలే. ఆ అపార్టుమెంటుకి సెక్యూరిటీగా ఉన్న హరిశ్చంద్ర (దేవి ప్రసాద్) ఆమె తండ్రినే. ఆ సంఘటనకి కారకుడిగా అతను జైలు శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. అయితే అప్పటికి చిన్నపిల్లలుగా ఉండటం వలన, మేఘ ఎవరనేది రిషికి తెలియదు. ఇక రాఘవ్ తో పాటు కలిసి పనిచేసే దేవిక (సంచిత పూనాచ) ఆయనను ఇష్టపడుతూ ఉంటుంది.పదేళ్ల క్రితం మారుతి అపార్టుమెంటులో జరిగిన మాదిరిగానే, ఓ హాస్పిటల్లో అగ్నిప్రమాదం జరుగుతుంది. 20 మంది పేషంట్లు చనిపోతారు. దాంతో మారుతి అపార్టుమెంటు కేసుపైకి మరోసారి తెరపైకి వస్తుంది. అప్పటి సంఘటనకు కారణమైనవారే, ఇప్పటి సంఘటనకు పాల్పడి ఉంటారనే సందేహం తలెత్తుతుంది. ఆ విషయం తెలుసుకోవడానికిగాను, రిషిని ఉపయోగించుకోవాలని రాఘవ అనుకుంటాడు. తన సైకో మెట్రి శక్తితో రిషి ఏం చెబుతాడు? ఎలాంటి నిజాలు బయటికి వస్తాయి? అనేది కథ.
Latest News