|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:58 AM
ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ నటించిన తాజా చిత్రం 'దురంధర్'. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ బాలీవుడ్ కు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఈ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ అనూహ్యంగా సోషల్ మీడియాలో విమర్శలకు గురయ్యారు. దీనికి కారణం స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఇచ్చిన ఒక వివాదాస్పద సమాధానం! ఈ పరిణామం తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య పాత వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది.ప్రముఖ నిర్మాత నాగవంశీ, 'దురంధర్' విజయం సాధించిన నేపథ్యంలో, అనుకోకుండా బాలీవుడ్ వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఒక 'ఎక్స్' యూజర్... 'దురంధర్' విజయాన్ని ప్రస్తావిస్తూ, నాగ వంశీ పాత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయన ఫోటోను పోస్ట్ చేసి, 'ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు?' అని ప్రశ్నించారు. దీనికి సిద్ధార్థ్ ఆనంద్ వెంటనే స్పందిస్తూ, 'ఎక్కడో నిద్ర పట్టక బాధపడుతున్నాడు' అని రిప్లై ఇచ్చారు. ఈ రిప్లై కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆనంద్ దాన్ని డిలీట్ చేశారు. అయినప్పటికీ, స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Latest News