|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:59 AM
'ఆ నలుగురు, రంగమార్తండ, కన్నప్ప వంటి విలక్షణమైన సినిమాలకు సలక్షణమైన మాటలు అందించిన ప్రముఖ కథా రచయిత, నవలాకారుడు ఆకెళ్ళ శివప్రసాద్. ఆయన ఇటీవల దైవభక్తి, దేశభక్తి, అనువంశిక సంప్రదాయ పరంపర, వారసత్వ సంపదల సంరక్షణ నేపథ్యంలో 'అంబారీ' అనే నవల రాశారు. జాగృతి వార పత్రిక నిర్వహించిన నవలల పోటీలలో ఇది బహుమతిని పొందింది. ఈ నవలను ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ గురువారం ఆవిష్కరించి, రచయిత శివ ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు.'అంబారీ' నవల గురించి కృష్ణవంశీ మాట్లాడుతూ, 'రేఖామాత్రమైన ఒక అంశాన్ని తీసుకొని దానికి చారిత్రక ప్రాధాన్యతను కల్పిస్తూ, దేశభక్తిని, దైవభక్తిని, వారసత్వ వైశిష్ట్యాన్ని, సాంస్కృతిక అనురక్తిని కలిగిస్తూ అద్భుతమైన రీతిలో నవలారచన చేయడం రచయిత ఆకెళ్ళ శివప్రసాద్ కాల్పనికశక్తికి నిదర్శనమ'ని అన్నారు. ఈ నవలకు 'అంబారీ' అనే పేరు పెట్టడం కూడా సముచితంగా ఉందని ప్రశంసించారు. ఈ నవల గురించి రచయిత ఆకెళ్ళ శివప్రసాద్ మాట్లాడుతూ, 'అక్కన్నమాదన్నల కాలం నాటి ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ ఈ కథ సాగుతుంది. భూబకాసురుల పంజాలో ప్రాచీన దేవాలయాలు సైతం ధ్వంసమవుతున్నాయి. మారుతున్న సంప్రదాయంలో కొత్త తరాలు చదువులు, ఉద్యోగాలంటూ మూలాలకు దూరమవ్వడం జరగుతోంది. ఈ నేపథ్యంలో సాంస్కృతిక పురావైభవానికి 'నేనుసైతం' అంటూ ఎవరో ఒకరు ముందుకు రావాలనే ప్రేరణగా ఈ నవలను రాశాను' అని అన్నారు. ఓ మాజీ సైనికుడి జీవితంలో జరిగిన ఘట్టాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ నవలను అల్లినట్టు ఆయన తెలిపారు.
Latest News