|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 02:23 PM
తెలుగు తెర ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలను పరిచయం చేయడానికి ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటుంది. కొత్త బ్యూటీలను ఆదరించడానికి ఇక్కడి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఒకప్పుడు ఇక్కడి సిల్వర్ స్క్రీన్ పై ముంబై భామల హవా కొనసాగినప్పటికీ, ఆ తరువాత కాలంలో మలయాళ భామలు తమ జోరును కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఇక్కడ వారి దూకుడే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో అమ్మాయి మలయాళం నుంచి దిగిపోయింది. ఆ బ్యూటీ పేరే అనశ్వర రాజన్. అనశ్వర రాజన్ .. మలయాళంలో .. అక్కడి యూత్ లో ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్. అనశ్వరలో ఏదో తెలియని ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అందుకు సహజమైన ఆమె అభినయం కూడా తోడవడం .. సక్సెస్ లు వచ్చిపడటంతో బిజీగా మారిపోయింది. మలయాళంలో వచ్చిన 'నెరు' .. 'రేఖాచిత్రం' వంటి చిత్రాలు ఆమె నటనకి అద్దం పడతాయి. మోహన్ లాల్ వంటి గొప్ప నటుడితో ప్రశంసలు అందుకోవడం అనశ్వర ప్రతిభకు నిదర్శనం అనే చెప్పాలి. మలయాళంలో ఇప్పుడు అనశ్వరకి విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి సినిమాలను లైన్లో పెడుతూనే, ఆమె తెలుగు .. తమిళ .. హిందీ సినిమాలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉండటం విశేషం. తెలుగులో ఆమె చేసిన 'ఛాంపియన్' సినిమా ఈ నెల 25వ తేదీన థియేటర్లకు రానుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ జోడీగా ఆమె పరిచయమవుతూ ఉండటం విశేషం. ఈ సినిమా హిట్ అయితే అనశ్వర ఇక్కడ మరిన్ని సినిమాలు చేసే ఛాన్స్ ఉంది. ఓటీటీ సినిమాల ద్వారా అనశ్వర అభిమానులుగా మారిపోయిన ఇక్కడి కుర్రాళ్లంతా ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు.
Latest News