![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 06:22 AM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం 'అజ్ఞాతవాసి' బాక్సాఫీస్ బరిలో దారణంగా ఫెయిల్ అయ్యింది. పవన్ కళ్యాణ్‌తో దానికి ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన 'జల్సా' , 'అత్తారింటికి దారేది' సినిమాలు గ్రాండ్ సక్సెస్ ను అందుకోవడంతో సహజంగానే 'అజ్ఞాతవాసి' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ 2018లో వచ్చిన ఈ సినిమా పరాజయం పాలైంది. దాంతో పవన్ కళ్యాణ్ మరో మూడేళ్ళకు గానీ 'వకీల్ సాబ్' చేయలేదు. ఈ మధ్యలో తన దృష్టి జనసేన కార్యకలాపాలపై పెట్టాడు. పవన్ కు అంతగా షాక్ ఇచ్చిన ఈ సినిమా పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ వచ్చింది. గతంలో విడుదలై పరాజయం పాలైన సినిమాలను సైతం ఇప్పుడు రీ-రిలీజ్ చేసి... మరోసారి తమ అదృష్టాన్ని మేకర్స్ పరీక్షించుకుంటున్నారు. దాంతో అప్పటి 'అజ్ఞాతవాసి' మరోసారి వస్తోందేమో అని పవన్ కళ్యాణ్ అభిమానులు భావించారు. అజ్ఞాతవాసి హ్యష్ ట్యాగ్ కనిపించగానే దానిని వైరల్ చేసేశారు. కానీ విషయం ఏమిటంటే... ఇప్పుడు 'అజ్ఞాతవాసి' పేరుతో ట్రెండింగ్ అవుతున్న వార్త పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించింది కాదు. అది ఓ కన్నడ సినిమా పేరు. కన్నడలోనూ 'అజ్ఞాతవాసి' పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. దానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీని జనార్దన్ చిక్కన్న డైరెక్ట్ చేశారు. రంగయాన రఘు, శరత్ లోహితాస్య, సిద్ధు మూలిమణి ఇందులో కీ-రోల్స్ ప్లే చేశారు. ఈ సినిమా ఏప్రిల్ 11న జనం ముందుకు రాబోతోంది. ఈ 'అజ్ఞాతవాసి' మూవీ పేరును సోషల్ మీడియాలో చూసి, చాలామంది పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'ని గుర్తు చేసుకున్నారు. అదే రీ-రిలీజ్ అవుతోందని భ్రమపడ్డారు.
Latest News