![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 10:26 AM
వినోదాత్మక కథాంశంతో రూపొంది విజయం సాధించిన చిత్రం 'మ్యాడ్'. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తూ మంచి వసూళ్లను సాధిస్తోంది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. కాగా ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు క్రేజీ కథానాయకుడు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ '' ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్ అంతకంటే గొప్ప సక్సెస్ కావడం చాలా అరుదు. ఆ అరుదైన ఘనతను దర్శకుడు కళ్యాణ్ సాధించాడు. భవిష్యత్‌లో ఆయన ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని ప్రతి పాత్రను నేను ఎంతో ఎంజాయ్ చేశాను. ఒక పాత్రను దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానిని నిజమైన పర్ఫామెన్స్ యాక్టర్ ఇవ్వగలిగినప్పుడు ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్ గా నాకు తెలుసు. ఇక లడ్డు పాత్ర పోషించిన విష్ణు లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో అనిపించింది. నా దృష్టిలో నాకు రాముడిగా చేయడమే కష్టం. ఎందుకంటే అమాయకంగా బిహేవ్ చేయడం మనం మర్చిపోయాం లైఫ్ లో. ఆ ఇన్నోసెన్స్ విష్ణు బాగా పర్ఫామ్ చేశాడు. నాకు 2011 లో పెళ్లి అయింది. అప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లోడు. నాతో మాట్లాడటానికి కూడా భయపడేవాడు. అలాంటి నితిన్ నాతో ధైర్యం చెప్పిన ఒకే ఒక్క మాట.. బావ నేను యాక్టర్ అవుతాను అని. కానీ ఏ రోజు నితిన్ నా రికమండేషన్, ఇన్‌వాల్వ్‌మెంట్ కోరుకోలేదు. నేను కూడా నీ మనసుకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళు చెప్పాను. నా సపోర్ట్ లేకుండా తనే కథలు ఎంచుకుంటూ ముందుకి వెళ్ళాడు. ఈరోజు నితిన్ సక్సెస్ చూసి గర్వంగా ఉంది. ఈ సక్సెస్‌కు కారణం నితిన్‌కు మంచి దర్శకులు, మంచి నిర్మాతలు దొరికారు. అందుకే నితిన్ నటుడిగా విజయాలు అందుకుంటున్నాడు'' అన్నారు.
Latest News