|
|
by Suryaa Desk | Fri, Mar 21, 2025, 04:10 PM
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిరోజు సుమారు రూ. 1,700 కోట్లకు పైగా అప్పు చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అప్పు రూ. 8.6 లక్షల కోట్లకు చేరిందని ఆయన పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమిషానికి రూ. 1 కోటికి పైగా అప్పు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై రుణభారం రూ. 2.27 లక్షలుగా ఉందని వెల్లడించారు.ఇంత భారీ స్థాయిలో రుణాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. యూపీఏ హయాం కంటే ఎన్డీయే హయాంలో ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రాలకు పెరిగాయని ఆయన స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా 32 శాతం మాత్రమే ఉండగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాటాను 10 శాతం పెంచి 42 శాతానికి చేర్చారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటాను పెంచినప్పటికీ విమర్శలు చేయడం సముచితం కాదని ఆయన హితవు పలికారు.