![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 11:11 AM
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ఈరోజు మధ్యాహ్నం మధ్యంతర నివేదికను పంపించారు. హైకోర్టు నివేదికను జస్టిస్ గవాయ్ ధర్మాసనం పరిశీలించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది.కంచ గచ్చిబౌలి వ్యవహారానికి సంబంధించి వార్తా కథనాలను అమికస్ క్యూరీ జస్టిస్ గవాయ్ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ప్రతివాదిగా చేర్చింది.ఆ భూమిలో అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ అది అటవీ ప్రాంతం కాకపోయినప్పటికీ, చెట్లు కొట్టే ముందు అనుమతులు తీసుకున్నారా అని అడిగింది. ఒక్కరోజులో వందల ఎకరాల్లో చెట్లు కొట్టేయడం సాధారణ అంశం కాదని వ్యాఖ్యానించింది. తమ ప్రశ్నలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.