|
|
by Suryaa Desk | Wed, May 28, 2025, 06:48 PM
మనలో చాలా మందికి ఫ్యాన్సీ నంబర్ల పిచ్చి ఉంటుంది. మరీ ముఖ్యంగా వాహనాలకు తీసుకునే నంబర్ ప్లేట్ల విషయంలో ఫ్యాన్సీ నంబర్ పొందడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొందరికి మాత్రం ఫ్యాన్సీ నంబర్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. వాహనం కన్నా ఎక్కువగా దానికి తీసుకునే నంబర్‌కు ఖర్చు చేసేవాళ్లు కూడా ఉంటారు. ఇక తాజాగా 9999 నంబర్ కోసం లక్షలు ఖర్చు చేశారు. ఈ విషయం తెలిసిన వాళ్లు నంబర్ ప్లేట్ కోసం పెట్టిన ఖర్చుతో మరో లగ్జరీ కారు కొనుకోవచ్చు కదా బ్రో అంటున్నారు. ఆ వివరాలు..
ఈసంగటన తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ రికార్డు స్థాయి ధర పలికింది. ఏకంగా 12 లక్షల రూపాయలకు పైగా చెల్లించి మరీ.. ఈ నంబర్‌ని సొంతం చేసుకున్నారు. హసన్‌పర్తి మండలం, చింతగట్టు క్యాంపులోని జిల్లా రవాణా కార్యాలయంలోని ఆర్టీఏ అధికారులు TGA 03A 9999 రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఆన్‌లైన్ టెండర్లను ఆహ్వానించారు.
ప్రభుత్వం ప్రకారం.. ముందుగా దీనికి 50 వేల రూపాయల బేస్ ధర నిర్ణయించారు. అయితే వేలంలో ఈ నంబర్‌ను దక్కించుకోవడం కోసం చాలా మంది పోటీ పడ్డారు. ఒకరిని మించి ఒకరు రేటు పెంచుతూ పోయారు. చివరకు మే 27, మంగళవారం జరిగిన ఆన్‌లైన్ వేలంలో ఓ కంపెనీ రూ.12.60 లక్షలు కోట్ చేసి దీన్ని దక్కించుకుంది. హనుమకొండ కావేరీ ఇంజనీరింగ్ యాజమాన్యం 9999 ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.12.60 లక్షలు కోట్ చేసి అత్యధిక బిడ్‌తో నంబర్ దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే 9999 ఫ్యాన్సీ నంబర్ కోసం చాలా మంది రూ. 12 లక్షల వరకు బిడ్లను సమర్పించినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. గతంలో హీరో నందమూరి బాలకృష్ణ తన కారు ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా రూ.7.75 లక్షలు ఖర్చు చేశారు. TG09 F0001 ఫ్యాన్సీ నంబరు కోసం బాలయ్య ఇంత భారీ మొత్తంలో చెల్లించారు. త్వరలోనే వినియోగంలోకి తెచ్చే బీఎండబ్ల్యూ వాహనం కోసం బాలకృష్ణ ఈ నంబర్ దక్కించుకున్నట్లు సమాచారం.