|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 12:44 PM
నగరంలో అగ్ని ప్రమాదాల నివారణకు హైడ్రా అవగాహన కార్యక్రమాలను ప్రారంభించింది. నాంపల్లిలోని ఫర్నీచర్ షోరూంలో జరిగిన అగ్ని ప్రమాదంతో పాటు.. నగరంలో జరిగిన పలు ఘటనల నేపథ్యంలో నగర ప్రజలను అప్రమత్తం చేయడానికి చర్యలు తీసుకుంది. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఇటీవల జరిగిన తనిఖీల్లో వెల్లడైన తర్వాత.. పెద్దయెత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని హైడ్రా గుర్తించింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు తూచా తప్పకుండా పాటించేందుకు నెల రోజులు గడువు ఇస్తూనే.. అవగాహన కార్యక్రమాలను కూడా హైడ్రా చేపట్టింది. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఒక వేళ అగ్ని ప్రమాదం జరిగితే ఎలా మంటలను అదుపులోకి తీసుకురావాలి. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించే విధానాలను ఈ సందర్భంగా హైడ్రా వివరించింది. ఫైర్ ఎక్ట్సింగ్విషర్లు వినియోగించడం, మానవ ప్రమేయం లేకుండా మంటలను ఆర్పే వాటర్ స్ప్రింక్లర్ల పనితీరు, స్మోక్ డిటెక్టర్లపై అవగాహన కల్పించారు. పంజాగుట్ట, నార్సింగి, మెట్టుగూడ, కార్వాన్, షాపూర్‌నగర్, ఏ ఎస్ రావు నగర్, చందానగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఉప్పల్, బేగంపేట, చాంద్రాయణగుట్ట, సంతోష్ నగర్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45, లకడికాపూల్, మాధాపూర్, సనత్‌నగర్, రేతిబౌలి క్రాస్ రోడ్స్, నాగార్జున సర్కిల్, గచ్చిబౌలి - మియాపూర్, దిల్‌సుఖ్‌నగర్, అల్వాల్, బడంగపేట్, అల్కాపురి క్రాస్‌రోడ్స్, అత్తాపూర్, బంజారాహిల్స్, క్లాక్ టవర్ సర్కిల్, ఈసీఐఎల్, కొంపల్లి, నాంపల్లి, శంషాబాద్, పెద్దఅంబర్‌పేట, బాచుపల్లి, తూముకుంట తదితర ప్రాంతాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కార్మికులు,వ్యాపారులు ఎలా భద్రంగా ఎలా బయట పడాలో సూచించారు. షాపులలో ఫైర్ ఎగ్జిట్ మార్గాలను గుర్తించడం.. మంటలంటుకుంటే అగ్ని మాపక శాఖకు చెందిన 101తో పాటు.. హైడ్రా కంట్రోల్ రూమ్ 1070తో పాటు 9000113667 కు ఫోను చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ఫైర్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు.