|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:32 PM
మున్సిపల్ ఎన్నికల్లో బి-ఫామ్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని, తాము రాజకీయ వ్యభిచారం చేయడం లేదని జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ సరిత బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాలలో కాంగ్రెస్ కష్టకాలంలో పార్టీ జెండా మోసిన తనకు, డీసీసీనే మోసం చేసిందని, ఈ విషయంపై టీపీసీసీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కాదని గుంటనక్కలకు సీట్లు పంపిణీ చేశారని ఆరోపించారు. అధిష్టానం తన వైపే ఉందని, ప్రజలకు మరింత దగ్గరై తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆమె తెలిపారు.బహుజన బిడ్డను అణగదొక్కడానికి కుయుక్తులు పన్నిన శక్తులపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. పూటకో మాట మార్చే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ఎవరికి ఇంకా తెలియదని, అటువంటి వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫాంలు అందజేయడం శోచనీయమని అన్నారు. పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడిండ్రో రాష్ట్ర నాయకులకు తెలుసు అని పేర్కొన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. కొందరి బీ-ఫాంలు ఇచ్చి క్యాన్సల్ చేసి ఎమ్మెల్యేకు ఇవ్వడం పట్ల ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.