|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:08 PM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడే దారి తప్పి, తను పనిచేస్తున్న పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడైన టీచర్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు.పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పర్రే మైటీన్ (27) ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వలవేశాడు. ఇటీవల బాలిక మెడలో పసుపు తాడు ఉండటాన్ని ఆమె తల్లి గమనించి నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. టీచర్ తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని విద్యార్థిని చెప్పడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు మొదట పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. అయితే, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోచారం పోలీసులు నిందితుడైన టీచర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.