|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:52 PM
హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన అంబర్‌పేట వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ కింద నిర్మించాల్సిన సర్వీసు రోడ్డు భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు వెంటనే భూసేకరణ పూర్తిచేసేలా చొరవ చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుక్రవారం (మార్చి 6) లేఖ రాశారు. ఎన్‌హెచ్-163పై అంబర్‌పేట క్రాస్ రోడ్డు వద్ద 1.5 కిలోమీటర్ల పొడవైన 4 వరుసల ఫ్లైఓవర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రూ.265 కోట్ల వ్యయంతో నిర్మించిందని చెప్పారు. దాని సర్వీసు రోడ్డుకు అవసరమైన భూసేకరణ పూర్తి కానందున కింది సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదని చెప్పారు. అందుకు అడ్డంకులు ఎదురవుతున్నాయని.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ విషయంలో చొరవ చూపి సర్వీసు రోడ్డు నిర్మాణం పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి లేఖలో సీఎంను కోరారు.
కాగా, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ హైదరాబాద్ - వరంగల్ రహదారిపై ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. గోల్నాక నుండి అంబర్‌పేట 6 నంబర్ జంక్షన్ వరకు సాగే ఈ వంతెన ద్వారా వరంగల్ వైపు వెళ్లే ప్రయాణికులకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. ఫ్లైఓవర్ ప్రధాన నిర్మాణం పూర్తయినప్పటికీ, కింద ఉండే సర్వీసు రోడ్ల విస్తరణ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం భూసేకరణ ప్రక్రియలో ఉన్న జాప్యం. ఫ్లైఓవర్ కింద ఇరువైపులా సర్వీసు రోడ్లను కనీసం 7 మీటర్ల వెడల్పుతో నిర్మించాల్సి ఉంటుంది.
అయితే, కొన్ని చోట్ల ప్రైవేటు ఆస్తులు, మతపరమైన కట్టడాలు, వ్యాపార సముదాయాల సేకరణ ఇంకా పూర్తి కాలేదు. దీంతో పాటు భూ యజమానులకు చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలో ఉన్న న్యాయపరమైన చిక్కులు, క్షేత్రస్థాయిలో ఉన్న అడ్డంకుల వల్ల రోడ్ల విస్తరణ నెమ్మదించింది. సర్వీసు రోడ్లు పూర్తికాకపోవడంతో స్థానికంగా ఉండే దుకాణదారులు, బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ సమన్వయంతో పెండింగ్‌లో ఉన్న భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.