|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:55 PM
హైదరాబాద్ మహా నగరంలో మరో అంతర్జాతీయ సంస్థ తన కార్యాలయాన్ని నెలకొల్పనుంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టగా.. తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం, వీఎఫ్‌ఎక్స్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్ హౌజ్ నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్ సిటీలో తన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ ఆఫీసును ప్రారంభించనున్నారు. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఈ ఆఫీసు ఏర్పాటు కానుంది. నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో అడుగు పెట్టి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో కొత్తగా విస్తరణ చేపడుతోంది. ఇప్పటికే ముంబయిలో ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. హైదరాబాద్‌లో నెలకొల్పేది రెండో కార్యాలయం అవుతుంది. ఈ విస్తరణతో హైదరాబాద్ నగరం గేమింగ్ అండ్ కామిక్స్ (ఏవీజీసీ ), యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ రంగం మరింత పటిష్ఠం కానుందని సర్కార్ భావిస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ ఏర్పాటుతో సృజనాత్మక, సాంకేతిక ప్రతిభ ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డ్వాన్స్‌డ్ స్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా ఏవీజీసీలో నైపుణ్యాభివృద్ధికి ఊతం లభిస్తుందని అంటున్నారు. హైదరాబాద్ నగరాన్ని డిజిటల్ కంటెంట్ సృష్టిలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా ఇది కీలక ముందడుగని చెప్పారు. తెలంగాణ సర్కార్ అవలంబిస్తోన్న ఇన్నోవేషన్, క్రియేటివ్ పరిశ్రమల అభివృద్ధి దిశలో ఈ తాజా విస్తరణ మరింత బలం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత వీఎఫ్‌ఎక్స్ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయన్నారు. హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ సేవలను ఇక్కడి నుంచే అందిస్తున్నాయని చెప్పారు.
అందులో డిస్నీ, స్కైలైన్ వీఎఫ్‌ఎక్స్, మాటెల్, వార్నర్ బ్రదర్స్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, ఉబిసాఫ్ట్, బార్న్ స్టార్మ్ వీఎఫ్‌ఎక్స్ తదితర సంస్థలు ఉన్నాయని అంటున్నారు. హాలీవుడ్ సినిమాల్లో వాడే ‘మోషన్ క్యాప్చర్’ టెక్నాలజీ హైదరాబాద్ నగరంలోనూ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. నగరంలోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఏర్పాటు చేసిన ఎం అండ్ ఎం క్యాప్ ల్యాబ్‌ను ఈ మధ్య కాలంలోనే ప్రారంభించినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు.