|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 10:48 AM
చెరువుల చెంత ఆర్థిక అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డి గారు అన్నారు. చెరువులు మహిళలకు ఆదాయవనరుగా మారాలని సూచించారు. ఉదయమే వాకింగ్ చేసుకుంటూ చెరువుల చెంత ఏర్పాటు ఏర్పాటు షాపుల్లో పాలు, కూరగాయలు, పళ్లు కొనుక్కొని వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీలో ఇటీవల హైడ్రా పునరుద్ధరించిన బమ్‌రుకున్ - ఉద్ - దౌలా చెరువును ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డిగారు ఆదివారం ప్రారంభించి ప్రసంగించారు. నగరంలో అభివృద్ధి చేసిన చెరువులన్నీ లేక్ ఎకానమీ జోన్‌లుగా మారాలని సూచించారు. ఇదే పరిస్థితి మూసీ చెంత కూడా జరగాలని ఆదేశించారు. గండిపేట చెరువు నుంచి గౌరల్లి వరకూ 55 కిలోమీటర్ల మూసీ నదికి ఇరువైపులా నైట్ బజార్లు ఏర్పాటు చేసి నగర ప్రజలకు ఆర్థిక వనరుగా మార్చుతామని ముఖ్యమంత్రి చెప్పారు. వరదలు లేని నగరం ప్రభుత్వ లక్ష్యమని.. ఆ క్రమంలో నిజాంల కాలం నాటి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని పెద్దయెత్తున చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా.. హిమయత్‌సాగర్ ఎకో పార్కును ప్రజలకు అందించాం.. నేడు బమృకున్ ఉద్ దౌలా చెరువును ప్రారంభించుకున్నామని తెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్ రాక్స్, లేక్స్ తో ప్రపంచంలోనే సుందరమైన నగరంగా ఉండింది. ఈ నగరం మనది. దీన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా అందరిపైన ఉంది.
నగర ప్రజలకు కాలుష్యం లేని వాతావరణం, మంచి నీరు, గాలిని , మంచి జీవన ప్రమాణాలను అందించేందుకు చెరువులు దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌రెడ్డి గారు అన్నారు. నాడు నిజాం సర్కారు గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసి.. లేక్స్ అండ్ రాక్స్ సిటీగా అభివృద్ధి చేశారు. నేడు ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తోంది. అందుకే నగరంలో చెరువులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపడి.. పర్యావరణహితమైన నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈనగరం.. అత్యంత పురాతనమైన, చరిత్ర కలిగిన నగరం.. చరిత్రను కల్పోయే ప్రమాదం ఉంది. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యం. ఆక్రమణలకు గురైన చెరువును పునరుద్ధరించి.. పార్యటక, మెరుగైన జీవన ప్రమాణాలను కల్పిస్తున్నాం. గతంలో అంబర్‌పేట్‌లోని పురాతనమైన బతుకమ్మకుంటను అందుబాటులోకి తెచ్చాం. ఆక్రమణదారులు ఏళ్ల నాటి చెరువును కబ్జాపెట్టి.. బతుకమ్మ ఆడే అవకాశాన్ని దూరం చేశారు. నేడు బమ్‌రుకున్ ఉద్ దౌలా చెరువును అందుబాటులోకి తెచ్చామన్నారు. పాతబస్తీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వంతెనలు నిర్మిస్తున్నాం. మెట్రో అందుబాటులోకి తెస్తున్నాం.. ఇవన్నీ ఇక్కడి ప్రజల అభివృద్ధికి దోహదం చేసేవని పేర్కొన్నారు.
హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువుల చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. బమ్‌రుకున్ - ఉద్ -దౌలా లేక్ విషయంలో కూడా ఆక్రమణలు తొలగించి 4.20 ఎకరాలకు పరిమితమైన చెరువును 18 ఎకరాలకు విస్తరించామని చెప్పారు. చెరువు చుట్టూ పాత్‌వేలు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ప్లే ఏరియాలు అభివృద్ధి చేసి ఆరోగ్యానికి ఆనవాళ్లుగా అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రభుత్వ నిర్దేశానుసారం చెరువులను అబివృద్ధి చేస్తున్నామన్నారు. రెవెన్యూ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గారు, ఎంఐఎం అధ్యక్షుడు శ్రీ అసదుద్దీన్ ఒవైసీ గారు, రాజ్యసభసభ్యులు శ్రీ అనిల్‌కుమార్‌యాదవ్ గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు జీహెచ్ ఎంసీ కమిషనర్ శ్రీ కర్ణన్ గారు తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు చెరువు చెంత ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే అక్కడ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు.