by Suryaa Desk | Tue, Jan 21, 2025, 05:57 PM
ఒక భాషలో విజయవంతమైన సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో వెబ్‌సిరీస్‌లను సైతం రీమేక్ చేస్తూ అలరిస్తున్నారు దర్శక-నిర్మాతలు. ఇప్పుడు హిందీలో విజయవంతమైన ఓ వెబ్‌సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ‘పంచాయత్’.. ప్రేక్షకులను అమితంగా అలరించిన వెబ్‌సిరీస్‌ల్లో ఒకటి. ఇప్పటికే దీన్ని తమిళంలో ‘తలైవెట్టియాన్ పాలయం’ పేరుతో రీమేక్ చేయగా, అక్కడ కూడా మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఈ సిరీస్ సిద్ధమైంది.రాగ్ మయూర్ కీలకపాత్రలో ‘సివరపల్లి పేరుతో ‘పంచాయత్’ సిరీస్‌ను రీమేక్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జనవరి 24వ తేదీ నుంచి ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతోంది. ఇందులో రాగ్ మయూర్ శ్యామ్ అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన శ్యామ్.. తెలంగాణలో మారుమూల గ్రామమైన సివరపల్లిలో ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నిజాయతీగా పని చేయాలనుకున్న శ్యామ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించాడు? అన్న ఆసక్తికర, కథ, కథనాలతో ఈ సిరీస్ సాగనుంది.భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, ఉదయ్ గుర్రాల, సన్నీ పల్లె, పావని కరణం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కోషి, శ్రేయాన్ష్ పాండేలు నిర్మించారు.
Latest News