by Suryaa Desk | Wed, Jan 22, 2025, 12:24 PM
ఆదాయపు పన్ను శాఖ అధికారుల వరుస దాడులు టాలీవుడ్లో కలకలం రేపుతోన్నాయి. నిన్నటికి నిన్న ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ తెల్లవారు జాము నుంచి ఏకకాలంలో ఈ దాడులు మొదలయ్యాయి.రెండోరోజు కూడా హైదరాబాద్‌లో పలుచోట్ల ఈ ఐటీ దాడులు సాగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఈ సోదాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.రెండో రోజు కూడా హైదరాబాద్‌లో ఐటీ సోదాలు ముమ్మరం అయ్యాయి. శ్రీవేకంటేశ్వర క్రియేషన్స్‌తో మొదలైన ఈ తనిఖీలు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఐటీ అధికారులు. ఆయా నిర్మాణ సంస్థలు సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా తీస్తోన్నారు. ఇప్పుడు తాజాగా పుష్ప-2 దర్శకుడు సుకుమార్ కూడా ఐటీ రాడార్లోకి వెళ్లిపోయారు. ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు చేపట్టారు. పుష్ప 2 సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ సహా ఆయనకు ఉన్న ఆదాయ వనరుల గురించి ఆరా తీస్తోన్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. సుకుమార్‌ను ఎయిర్‌పోర్ట్‌లోనే పికప్ చేసుకున్నట్లు సమాచారం.
Latest News