by Suryaa Desk | Thu, Jan 23, 2025, 02:59 PM
ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాంగోపాల్ వర్మకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ముంబై కోర్టు ఆయనకు 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడం సంచలనంగా మారింది. ఆర్జీవికి విధించిన శిక్ష బాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. అయితే ఈ తీర్పు విషయంలో ఆర్జీవి స్పందన ఎలా ఉంటుంది? పై కోర్టులో తీర్పును సవాల్ చేస్తారా? లేదా పిటిషన్ దారుడితో రాజీ చేసుకొంటారా? అనే విషయంపై రకరకాల చర్చ జరుగుతున్నది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..దర్శకుడు రాంగోపాల్ వర్మపై గతంలో చెక్ బౌన్స్ కేసు నమోదైంది. నెగోషియబుల్ ఇస్ట్రుమెంట్స్ యాక్ట్ కింద నమోదైన కేసును కోర్టు విచారించింది. దాదాపు 3.72 లక్షల మేర చెల్లించలేదని పిటిషన్ దారు కేసు నమోదు చేశారు. 2018లో మహేశ్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి వర్మ కంపెనీపై కేసు నమోదు చేశారు.
అయితే కరోనా విపత్తు తర్వాత వర్మ ఆర్థికంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముంబైలోని తన కార్యాలయాన్ని నిర్వహించలేని పరిస్థితుల్లో దానిని అమ్మివేశారు. ఆర్థిక సమస్యల్లో భాగంగా శ్రీ అనే కంపెనీని నిర్వహిస్తున్న మిశ్రాకు కొంత మేర బాకీ పడ్డారు. దానిని చెల్లించకపోవడంతో నెగోషియబుల్ ఇస్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద కేసు నమోదు చేశారు అని మీడియాలో కథనాలు వస్తున్నాయి.చెక్ బౌన్స్ కేసు వ్యవహారంలో వర్మకు 2022 సంవత్సరంలో కోర్టు శిక్ష విధించింది. అయితే తనపై విధించిన శిక్షపై అప్పీల్ చేసుకోవడంతోపాటు 5వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ తీసుకొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బెయిల్ృపై ఉన్నారు. ఈ కేసులో వర్మ ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి మూడు నెలల శిక్షను విధిస్తున్నట్టు తెలిపారు. ఈ తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.