by Suryaa Desk | Thu, Jan 23, 2025, 11:16 AM
నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దుండగుడి దాడి ఘటన మరవక ముందే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. సెలబ్రిటీలకు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. ప్రతి రోజు ఏదో ఒక స్టార్ వీటి కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం.. హాస్యనటుడు కపిల్ శర్మను ఈసారి లక్ష్యంగా చేసుకున్నారు. అతనికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఈ మెయిల్‌లో.. మీరు ఇటీవల చేసిన మీ అన్ని చర్యలను మేము గమనిస్తూనే ఉన్నాము. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం ముఖ్యం. ఇది పబ్లిసిటీ స్టంట్ లేదా వేధించే ప్రయత్నం కాదు. ఈ మెసేజ్‌ను సీరియస్‌గా పరిగణించండి.. మీరు మా డిమాండ్‌ను నెరవేర్చకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. వచ్చే 8 గంటల్లో మాకు స్పందన రాకపోతే.. మేము తదుపరి చర్య తీసుకుంటామని హెచ్చరించారు.కపిల్ శర్మతో పాటు బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్, హాస్యనటుడు సుగంధ శర్మ, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజాలకు కూడా ఇలాంటి ఈ-మెయిల్స్ వచ్చాయి. ఈ విషయంపై సుగంధ, రెమో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్‌పాల్ యాదవ్ భార్య రాధా యాదవ్ ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీల ఫిర్యాదుతో ముంబై పోలీసులు అప్రమత్తమై కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Latest News