by Suryaa Desk | Thu, Jan 23, 2025, 02:57 PM
వెండితెరపై ఒక వెలుగు వెలిగిన నటి సిల్క్ స్మిత. ఆమె చనిపోయి చాలా కాలమే అయినా, ఆమెను గుర్తుచేసుకునేవారి సంఖ్య ఎక్కువే. సిల్క్ స్మిత గురించి ఆమె తమ్ముడు నాగవరప్రసాద్ ఒక యూ ట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ, అనేక విషయాలను ప్రస్తావించాడు. "మాది చాలా పేద కుటుంబం .. ఎవరమూ కూడా పెద్దగా చదువులేదు. మా అక్కయ్య అదృష్టం కొద్దీ సినిమాలలోకి వెళ్లి స్టార్ అయింది. నాది మోటార్ ఫీల్డ్ .. అప్పుడప్పుడు మద్రాస్ వెళ్లి వస్తుండేవాడిని. నాకు మా అక్కయ్య ఒక కారు కూడా కొనిపెట్టింది" అన్నారు. " మా అక్కయ్య చాలా భాషలలో నటిస్తూ చాలా బిజీగా ఉండేది .. డబ్బు బాగా వస్తుండేది. అలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తి ఆమెకి చేరువయ్యాడు. అతనికి భార్య .. ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా అక్కయ్య అతనిని పూర్తిగా నమ్మింది. ఒకరోజు రాత్రి అతను .. అతని పిల్లలు కలిసి ఆమెను చంపేశారు. డబ్బు .. నగలు .. డాక్యుమెంట్లు కాజేశారు. మేము వెళ్లేలోగా అందరినీ మేనేజ్ చేశారు. మా దగ్గర డబ్బు లేదు .. చదువులేదు. అక్కడ మాకు ఎవరి నుంచి ఎలాంటి సపోర్టు లేదు. దాంతో ఏం చేయాలో మాకు పాలుపోలేదు" అని చెప్పారు. " మా అక్కయ్యను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ ఇండస్ట్రీ నుంచి ఒక్క 'అర్జున్' తప్ప ఎవరూ రాలేదు. మా గురించి ఎవరూ పట్టించుకోలేదు. అనాథల మాదిరిగా అలా రోడ్డుపై నుంచుండి పోయాము. మా అక్కయ్య అప్పట్లోనే 20 కోట్లకి పైగా సంపాదించి ఉంటుంది. ఆ డబ్బంతా ఏమైపోయినట్టు? అంత మంచి మనిషికి ఇంతటి అన్యాయం జరుగుతూ ఉంటే అందరూ ఏం చేస్తున్నట్టు? నా మీద ఒట్టేసి చెబుతున్నాను . మా అక్కయ్య చనిపోయిన తరువాత ఆమెకి సంబంధించిన ఒక్క రూపాయి కూడా మా వరకూ రాలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News