by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:35 PM
మొన్న చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన నటి ప్రియాంక చోప్రా... ఈరోజు కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడికోట సుప్రసిద్ధ మహాదేవుని ఆలయానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఇవాళ ఉదయం కారులో దోమకొండకు చేరుకున్నారు. గడికోటకి వచ్చిన బాలీవుడ్ నటికి ట్రస్ట్ సభ్యులు, ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో కొలువుదీరిన సోమసూత్ర శివలింగానికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారామె. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రియాంక తన ఇన్‌స్టా స్టోరీస్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలాఉంటే.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ హాలీవుడ్‌లోనే మకాం వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆమె టొరంటో నుంచి హైదరాబాద్‌లో దిగారు. దీనికి కారణం సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 ప్రాజెక్టులో ఆమె భాగం కానున్నారట. ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంకను తీసుకున్నారని బీటౌన్ సర్కిల్ టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది
Latest News