by Suryaa Desk | Sat, Jul 13, 2024, 08:28 PM
హైదరాబాద్ నగరంలో 74 రోజులుగా రెస్టారెంట్లు, హోటళ్లుపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో షాగౌస్, పిస్తా హౌస్, ప్యారడైజ్, ఎమరాల్డ్ లాంటి పేరుపొందిన రెస్టారెంట్లలోనూ ఆహారానికి సంబంధించి భయానక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆహార పదార్థాల కల్తీ, కిచెన్‌లో అపరిశుభ్రతకు సంబంధించి నిజాలు ఫుడ్ లవర్స్‌ను ఆవేదనకు గురిచేస్తున్నాయి. అయితే, ఇన్ని రోజులుగా లేనిది ఇంత ధైర్యంగా ఈ దాడులు ఎవరు చేయిస్తున్నారు? రాజకీయాలకు, పలుకుబడికి, అధికారానికీ దేనికీ లొంగకుండా వరుసగా ఈ దాడులు ఎలా కొనసాగుతున్నాయి? నగరంలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. దీని వెనుక ఉన్నది ఓ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. ఆ యంగ్ ఆఫీసర్ పేరు ఆర్.వి. కర్ణన్. ఇప్పుడు జంట నగరాల్లో ఆయన పేరు చెబితేనే రెస్టారెంట్, హోటల్ నిర్వాహకుల వెన్నులో వణుకు పుడుతోంది. హైదరాబాద్‌లో ‘నయా సింగం’గా చెమటలు పట్టిస్తున్న ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కర్ణన్ గురించి ఆసక్తికర వివరాలు..
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో ఆహార భద్రత కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలకు చేపట్టిన తర్వాత.. 74 రోజుల్లో కేవలం హైదరాబాద్‌లోనే 129 రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్‌లపై వరుస దాడులు నిర్వహించి.. 90 షోకాజ్ నోటీసులు జారీ చేసి.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. ఆర్వీ కర్ణన్ పేరు వినిపిస్తే చాలు.. హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లే కాదు.. అందులో పని చేసే వెయిటర్లు, చెఫ్‌లు కూడా వణికిపోతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ హోటల్ మీద దాడి చేస్తాడో ఎవ్వరికీ తెలియదు. అధికారానికి, ఒత్తిడికి ఏమాత్రం భయపడకుండా.. దాడులు నిర్వహిస్తూ అందరికీ చెమటలు పట్టిస్తున్నారు ఆర్వీ కర్ణన్.
హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు సరిగ్గా... ఏప్రిల్ 16న ప్రారంభమయ్యాయి. ఇక అప్పటి నుంచి ఈ దాడులు ఎక్కడా ఆగింది లేదు. కర్ణన్ కేవలం స్కూల్ క్యాంటీన్‌లు, హాస్టల్ మెస్‌లను తనిఖీ చేయడం మాత్రమే కాదు.. పేరు మోసిన పెద్దపెద్ద రెస్టారెంట్లు, పేమస్ రెస్టారెంట్లు, పబ్బులు, స్వీట్ హౌస్‌లు ఇలా దేన్ని వదలకుండా అన్నింటినీ కవర్ చేస్తున్నారు. "ఈ రకమైన తనిఖీలను ఎవరూ ఊహించలేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు. కర్ణన్ ఆవుట్ ఆఫ్ సిలబస్‌లా ఎంట్రీ ఇచ్చాడు." అని ఓ ప్రముఖ హోటల్ డెస్క్ మేనేజర్ అభిప్రాయపడ్డారు.
షా ఘౌస్, పిస్తా హౌస్, రామేశ్వరం కేఫ్, టాకో బెల్, బాస్కిన్ రాబిన్స్, లా పినోస్ పిజ్జా, ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్, బాహుబలి కిచెన్ వంటి అనేక ప్రముఖ రెస్టారెంట్లు కూడా కర్ణన్ దాడుల్లో నోటీసులు అందుకున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. డెలివరీ యాప్‌ల గోదాములపై కూడా కర్ణన్ దాడులు నిర్వహించి.. వారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. కర్ణన్ దాడిలో.. పెద్ద పెద్ద హోటళ్ల వంటగదుల్లో.. అపరిశుభ్ర వాతావరణం, శుభ్రపరిచే ప్రదేశంలో మురికిగా ఉండటం లాంటి సన్నివేశాలు బయటపడ్డాయి. ఇక.. బాహుబలి కిచెన్‌లోని వంటగది పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయని టాస్క్‌ఫోర్స్ గుర్తించింది.
"కర్ణన్.. ఏ అధికారానికి గానీ పొలిటికల్ ఒత్తిడికి గానీ భయపడడు. తెలంగాణ ప్రజలకు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే ఆయన లక్ష్యం." అంటూ తెలంగాణ డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్‌గా పదవీ విరమణ చేసిన టి విజయ కుమార్ చెప్పుకొచ్చారు. కర్ణన్ ఎంత నిబద్ధతతో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్‌ను ఆహార స్వర్గధామంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన మిషన్‌లో భాగంగా తనిఖీలు, దాడులను పెంచారు. జనవరిలో.. ప్రముఖ ఫుడ్ అవుట్‌లెట్‌లో షవర్మా తిన్న 15 మంది ఆసుపత్రి పాలయ్యారు. గత సంవత్సరం, ఒక మండి రెస్టారెంట్‌లో భోజనం చేసిన వారిలో సుమారు 30 మంది అనారోగ్యానికి గురయ్యారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
"నగరవాసులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడం.. ఆహార నాణ్యత, ప్రమాణాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే మా ప్రయత్నం." అని.. ఆర్వీ కర్ణన్ తెలిపారు. మరోవైపు.. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా పేరుందని.. ఆహార నాణ్యత విషయంలో రాజీపడకూడదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపారు. ఆయన చేసిన ఆదేశాల మేరకు.. ఆర్వీ కర్ణన్ ఇక ఎక్కడా రాజీపడకుండా తన పని కొనసాగిస్తున్నారు.
నగరంలో ఇంత చేస్తున్నా.. కర్ణన్ మాత్రం మీడియాలో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపించకుండా.. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. మీడియాలో తాను చేస్తున్న పనిని గొప్పగా చెప్పుకోరు. తెలంగాణ జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) డైరెక్టర్‌గా, ఆహార భద్రత కమిషనర్‌గా.. రెస్టారెంట్లు, హోటళ్లలోని కిచెన్లు అపరిశుభ్రంగా ఉంటాయన్న ప్రజల ఆలోచనను మార్చాలని కర్ణన్ కృషి చేస్తున్నారు.