by Suryaa Desk | Fri, Nov 15, 2024, 12:13 PM
శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కార్తిక పౌర్ణమి సందర్భంగా పంచాక్షరి స్మరణతో శైవాలయాలు మారుమోగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలకు పోటెత్తారు. ఉసిరిచెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపారధన చేస్తున్నారు. శివనామస్మరణ చేస్తూ 365 ఒత్తులను వెలిగిస్తున్నారు. శివపార్వతులకు అభిషేకాలు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతున్నది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది.వరంగల్ వేయిస్తంభాల దేవాలయంలో భక్తులు ఉసిరి చెట్టు కింద పూజలు చేసి దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. కాళేశ్వరం గోదావరి దగ్గర కార్తీక పౌర్ణిమ శోభ సంతరించుకుంది. పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించి దీపాలను భక్తులు గంగలో వదిలారు. మహబూబాబాద్ జిల్లా కందికొండ జాతరకు భక్తులు తరలిస్తున్నారు. దీంతో కందికొండ భక్తులతో రద్దీగా మారింది. దైవ దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుండటంతో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. భద్రాచలంలో గోదావరి తీరాన భక్తులు కార్తిక మాస పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కార్తిక దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు. హైదరాబాద్‌లోని శివాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు.