by Suryaa Desk | Wed, Nov 13, 2024, 07:44 PM
హైదరాబాద్ అంటే ఒకప్పుడు చార్మినార్, గోల్కొండ లాంటి చారిత్రాత్మక కట్టడాలు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఐటీ కారిడార్‌లో ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తులు కళ్ల ముందు మెదులుతాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత.. హైదరాబాద్ ఈస్ట్ ప్రాతం ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. మాదాపూర్, హైటెక్ సిటీ, కోకాపేట, నానక్‌రాంగూడ, నార్సింగి, పుప్పాలగూడ, ఖాజాగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ఆకాశాన్ని తాకే పెద్ద పెద్ద బిల్డింగులు, ఐకానిక్ కట్టడాలు నిర్మించారు. అటుగా వెళితే.. మనం హైదరాబాద్‌లో ఉన్నామా..? లేక లండన్, న్యూయార్క్ వంటి నగరాల్లో ఉన్నామా..? అనే అనుమానం కలుగుతుంది.
తాజాగా.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచేలా మరో ఐకానిక్ నిర్మాణం అందుబాటులోకి రానుంది. నగరంలోని కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలో సౌత్ ఇండియాలనే అతిపెద్ద కమర్షియల్ బిల్డింగ్ నిర్మించనున్నారు. బెంగళూరు నగరానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ బ్రిగేడ్ గ్రూప్ ఈ నిర్మాణాలను చేపట్టనుంది. అందుకు సంబంధించిన బిల్డింగ్ డిజైన్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 50+ అంతస్తుల్లో ఓ కమర్షియల్ బ్లాక్ నిర్మించనుండగా.. అందులో ఓరియన్ మాల్, ఆఫీస్ స్పేస్‌లు, 5 స్టార్ హోటల్ (ఇంటర్‌కాంటినెంటల్) అందుబాటులోకి రానున్నాయి.
మరో బ్లాక్‌లో 60 అంతస్తుల్లో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో పూర్తిగా నివాస సముదాయాలను నిర్మించనున్నారు. ఓరియన్ మాల్ ముందు భాగంలో ప్రత్యక్ష ప్రసారం చేసే స్క్రీన్‌తో అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది DLF ఎంపోరియో మాదిరిగా హై-ఎండ్ ఫ్యాషన్ మాల్ అవుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. ఇక మాల్ పైన డిస్క్ లాంటి నిర్మాణం లాస్ వెగాస్‌లోని ఫ్యాషన్ షో మాల్‌ను గుర్తు చేస్తుందని చెబుతున్నారు. ఈ కమర్షియల్ బ్లాక్ హైదరాబాద్ నగరంలో మరో ఐకానిక్ బిల్డింగ్‌గా మారుతుందని అంటున్నారు. కాగా, మరో ఐదేళ్లలో ఇది అందుబాటులోకి రానున్నట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి బ్రిగేడ్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్ సహా సౌత్ ఇండియాలో 30 అంతస్తుల వరకే కమర్షియల్ బిల్డింగులు అందుబాటులో ఉన్నాయి. ఈ బిల్డింగ్ 50+ అంతస్తుల్లో నిర్మిస్తే.. నగరం అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్, నివాస సముదాయాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆకాశాన్ని తాకేలా రెసిడెన్షియల్ బిల్డింగులు నిర్మిస్తున్నారు. తాజాగా 50+ అంతస్తుల్లో కమర్షియల్ బిల్డింగ్ నిర్మిస్తే.. ఇదే అతి పెద్దది కానుంది. ఇక కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలో భూముల ధరలు రూ. కోట్లలో పలుకుతున్నాయి. గతేదాడి హెచ్ఏండీఏ నిర్వహించిన వేలంలో ఇక్కడ ఎకరం రూ.100 కోట్లు పైగానే పలికింది.