by Suryaa Desk | Sat, Nov 16, 2024, 07:18 PM
తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా మూసీ ప్రక్షాళన అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఘాటు విమర్శలు, జోరు సవాళ్లు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే.. ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి ఓ సవాల్ విసరగా.. దాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు చాలా ఘాటుగా తిప్పికొడుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేద ఇండ్లు కూల్చితే ఊరుకునేది లేదని.. పేదల ఇళ్లపైకి వచ్చే బుల్డోజర్లకు తాము అడ్డుగా ఉంటామంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్తూ వస్తుండగా.. దానికి రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు.
మూసీ ప్రక్షాళకు అడ్డొస్తే.. అడ్డొచ్చిన వాళ్లందరినీ బుల్డోజర్లతో తొక్కిస్తా అంటూ హాట్ కామెంట్స్ చేయటం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పేదల కోసం పరితపించే ఆ ప్రతిపక్ష నేతలు వాళ్లు ఉంటున్న ప్రాంతాల్లో ఓ రెండు మూడు రోజులు ఉండి.. అంతా బాగానే ఉందని చెప్తే.. వెంటనే ప్రాజెక్టును విరమించుకుంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, ఈటల మూడు రోజులు ఉండాలని.. వారికి అయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని చెప్పుకొచ్చారు.
అయితే.. రేవంత్ రెడ్డి చేసిన ఈ ఛాలెంజ్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఇండ్లు కూల్చొద్దంటుంటే.. అడ్డమొచ్చినవారిని బుల్డోజర్లతో తొక్కిస్తానంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. పేదల కోసం చావటానికైనా సిద్ధమేనని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా.. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నిద్ర కార్యక్రమం చేపట్టారు.
ఈరోజు (నవంబర్ 16న) రాత్రి అంబర్‌పేట ప్రాంతంలోని తులసి రామ్ నగర్‌లో మూసీ పేదలు నివాసముంటున్న ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా.. ముఖ్య నేతలు బస్తీ నిద్ర చేయనున్నారు. కిషన్ రెడ్డితో పాటు, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కె. లక్ష్మణ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇతర నేతలు మూసీ పరివాహకంలోని 20 ప్రాంతాల్లో రాత్రి బస చేయనున్నారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆదివారం (నవంబర్ 17న) ఉదయం 9 గంటల వరకు బీజేపీ నేతలు ఆయా ప్రాంతాల్లో రాత్రి బస చేయనున్నారు. అయితే.. తులసీరాంనగర్‌లో కిషన్ రెడ్డి బస్తీ నిద్ర చేయనుండగా.. మలక్‌పేట శాలివాహననగర్‌లో లక్ష్మణ్, ఎల్బీనగర్ ద్వారకాపురంలో ఈటల బస్తీ నిద్ర చేయనున్నారు.
కాగా.. బీఆర్‌ఎస్ నేతలు కూడా మూసీ పరీవాహక ప్రాంతాల్లో జోరుగా పర్యటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు మూసీ బాధితులకు అండగా నిలిచారు. అయితే.. బీజేపీ నేతలు కేవలం పర్యటించటమే కాకుండా.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఛాలెంజ్‌ను కూడా స్వీకరించి.. బస్తీల్లో నిద్ర చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి బీజేపీ చేపడుతున్న ఈ బస్తీ నిద్రలను కూడా కాంగ్రెస్ తిప్పికొడుతుందా.. తర్వాత కార్యాచరణ ఏంటీ అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే.. మూసీ పరివాహక ప్రాంతాల్లో వెలిగొండ నుంచి చార్మినార్ వరకు పాదయాత్ర చేయనున్నట్టు ప్రకటించనున్నారు. దీంతో.. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఉత్కంఠగా మారింది.