by Suryaa Desk | Wed, Nov 13, 2024, 02:15 PM
ఖరీఫ్ సీజన్ లో కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం రైస్ మిల్లులకు సిఎంఆర్ అలాట్మెంట్ ఇస్తుంది.రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చేందుకు మిల్లర్ల వద్ద లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా వరిధాన్యం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు అప్పగిస్తుంది.రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్(సిఎంఆర్) చేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.ఐతే గతంలో కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం తీసుకుని సీఎంఆర్ తిరిగి ఇవ్వకుండా బియ్యం బయటకు అమ్ముకుని ప్రభుత్వానికి పంగ నామాలు పెట్టారు.ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు బాకీ పడ్డ డిఫాల్టర్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించి జిఓ.27 ను తీసుకువచ్చింది.ఐతే జిఓ.27 ను ఆసరగా చేసుకుని డిఫాల్టర్ల జాబితాలో ఉన్న ఓ రైస్ మిల్లర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖలో అజమాయిషీ చెలాయిస్తూ వసూళ్లకు తెరలేపినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.రైస్ మిల్లులకు సిఎంఆర్ ధాన్యం ట్యాగింగ్(అలాట్మెంట్)కావాలంటే ముడుపులు ముట్టజెప్పాల్సిందేనని డిఫాల్టర్ మిలర్లకు హుకుం జారీ చేస్తున్నాడు.పైసలిస్తేనే సిఎంఆర్ కేటాయించేలా పౌరసరఫరాల శాఖ అధికారులతో మిలాకత్ అయి,పౌరసరఫరాల శాఖ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని మిల్లర్ల వద్ద మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.ఈ సీజన్ లో బాయిల్డ్ రైస్ మిల్లులు,రా రైస్ మిల్లర్ల నుంచి సుమారు కోటి రూపాయలు టార్గెట్ గా పెట్టుకుని వసూళ్ల దందా సాగిస్తున్నట్లు సమాచారం.బాయిల్డ్ రైస్ మిల్లు ఐనా,రా రైస్ మిల్లు అయినా,మిల్లుల్లో సార్టెక్స్ ఉన్నా లేకున్నా రూ.1 లక్ష ఇవ్వాలని వసూలు చేస్తున్నాడట.రూ.1 లక్ష మామూళ్లు ఇవ్వకుంటే ఈ సీజన్ లో ధాన్యం అలాట్మెంట్ ఇచ్చేది లేదని మిల్లర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.అధికారులకు మామూళ్లు ఇవ్వాల్సి ఉంటుందని వారి పేరు చెప్పి ఒక్కో రైస్ మిల్లర్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి ఎలాంటి బాకీ లేకున్నప్పటికి అలాంటి మిల్లర్లకు ధాన్యం అలాట్మెంట్ ఇవ్వకుండా సదరు వసూల్ రాజా అడ్డుపడ్తున్నట్లు తెలిసింది.జిల్లాలో కొందరు రా రైస్ మిల్లర్లు,కొందరు బాయిల్డ్ మిల్లర్లు ప్రభుత్వానికి ఎలాంటి బాకీ లేకున్నా వారికి ట్యాగింగ్ చేయకుండా జిఓను అడ్డుపెట్టుకుని మిలర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.బ్యాంక్ గ్యారంటీ(బిజి),అండర్ టేకింగ్ ల నిబంధనలతో ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. మామూళ్లు ఇచ్చిన డిఫాల్టర్లకు ఎలాంటి షరతులు లేకుండానే అలాట్మెంట్ ఇప్పిస్తూ ఇష్టారాజ్యంగా వ్యాహరిస్తున్నాడు.గత ఏడాది కూడా మిల్లర్ల నుంచి వసూలు చేసిన కొంత మొత్తం డబ్బుతో బంగారు నాణేలు కొనుగోలు చేసి జిల్లా స్థాయి అధికారికి నజరానా ఇచ్చినట్లు సమాచారం.అధికారుల పేరు చెప్పి వసూలు చేసిన డబ్బులో సగం మాత్రమే అధికారులకు వెళ్తుతుందని,మిగతా సగం వసూలు చేసిన వారే నొక్కుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.జిల్లా స్థాయి అధికారులు మాత్రం ఆరోపణలన్నింటిని ఖండిస్తున్నారు.