by Suryaa Desk | Fri, Nov 15, 2024, 11:09 PM
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేశామంటూ ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి పాలన కూడా కొనసాగుతోందని పోల్చారు. రాష్ట్రంలో అవే అబద్ధాలు, అరాచకాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. వడ్లకు బోనస్ ఇస్తామని.. బోగస్ మాటలు చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరుల డైరెక్షన్లోనే రాష్ట్రంలో పోలీసు నియామకాలు, బదిలీలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల వల్లే వికారాబాద్‌లో కలెక్టర్‌పై గ్రామస్థులు దాడి చేశారంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలతో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. కాంగ్రెస్‌కు ఏకైక ఏటీఎమ్‌గా తెలంగాణ మారిందన్నారు. మూసీ పునరుజ్జీవనానికి ప్రతిపక్షాలు అడ్డొస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని చెప్పుకొచ్చిన కిషన్ రెడ్డి.. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ అభివృద్ధి కార్యచరణే లేదని మండిపడ్డ కిషన్ రెడ్డి.. హైదరాబాద్‌లో పేదల ఇండ్లు కూల్చేస్తూ.. నల్గొండలో రైతులను రెచ్చగొడుతుండటం తప్ప వాళ్లు చేసేదేమీ లేదని రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో పేదల ఇండ్ల కూల్చొద్దంటే.. బుల్డోజర్లతో తొక్కిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. పేదల కోసం చావడానికైనా సిద్ధమేనని కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని.. రేపు పేదల ఇళ్లలో మూసీ పక్కనే నిద్రిస్తామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. పేదల ఇళ్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే తప్పకుండా మద్దతిస్తామని చెప్పుకొచ్చారు. కేటీఆర్‌ను అరెస్ట్ కాకుండా బీజేపీ అడ్డుకుంటుందనేది పూర్తిగా అసత్య ప్రచారమని కిషన్ రెడ్డి కొట్టిపారేశారు.
మరోవైపు.. వనవాసి, గ్రామవాసి, నగరవాసి సమ్మేళనంతో లోక్ మంథన్ -2024 నిర్వహించనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో హైదరాబాద్ నగరవాసులతో పాటు, తెలంగాణ ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా కోరారు. ముఖ్యంగా యువత, పిల్లలు, స్థానికంగా ఉండే సాప్ట్ వేర్ ఉద్యోగులు నాలుగు రోజుల పాటు జరిగే మంథన్‌లో భాగస్వామ్యమై దేశ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించాలని కోరారు.