by Suryaa Desk | Tue, Nov 12, 2024, 06:40 PM
సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపంగా మారవద్దని తాను వేములవాడ రాజన్నకు మొక్కు చెల్లించుకున్నానని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అలాగే, సీఎంకు జ్ఞానోదయం కలిగేలా చూడాలని రాజన్నను వేడుకున్నట్లు తెలిపారు. ఆయన ఈరోజు వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పంద్రాగస్ట్‌లోగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టేసిన రేవంత్ ఆ తర్వాత మాట తప్పారని మండిపడ్డారు.వేములవాడ రాజన్నను ప్రజలు ఎంతో భక్తితో కొలుస్తారని, అలాంటి స్వామివారి మీద ఒట్టేసి రేవంత్ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుడు పాపం చేస్తే అది రాష్ట్రానికి అరిష్టమవుతుందని, ప్రజలకు శాపంగా మారుతుందని... అందుకే తాను స్వామివారిని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నానన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రేవంత్ మాట తప్పారని... ఆయనకు భక్తి లేదనే అనుమానం కలుగుతోందన్నారు.పంటకు మద్దతు ధర లేక, అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వడ్లకు బోనస్ ఇచ్చామని మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. కానీ రైతుబంధు, రైతు భరోసా... ఇలా అన్నీ ఎగ్గొట్టారన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అన్నీ అటకెక్కాయన్నారు. రాష్ట్రంలో పాక్షిక రుణమాఫీ జరిగిందన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి తక్షణమే దేవుడి వద్ద లెంపలు వేసుకోవాలన్నారు.కేసీఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు... తెలంగాణ రాష్ట్రం లేదు... కాబట్టి ఆయన గురించి మాట్లాడే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. కాంగ్రెస్ 11 నెలల పాలనలో ప్రజలు ఏం కోల్పోయారో చెప్పడానికి తాము సిద్ధమని... ప్రజలు ఏం పొందారో మీరు చెప్పగలరా? అని సవాల్ చేశారు. అప్పుల నుంచి ప్రజలు, రైతుల సమస్యల వరకు అన్నింటి పైనా చర్చించుదామన్నారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతుబంధు ఇచ్చారని గుర్తు చేశారు.కానీ కాంగ్రెస్ పాలనలో పోలీసులే... పోలీసు కుటుంబాలను కొట్టేలా చేశారని మండిపడ్డారు. అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువత వీపులు పగిలేలా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వచ్చాక తెలంగాణ ప్రజలు ప్రశాంతతను కోల్పోయారని వ్యాఖ్యానించారు. తెలంగాణ నెంబర్ వన్ స్థానం కోల్పోయిందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉంటే రేవంత్ పాలనలో మాత్రం ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారని చురక అంటించారు. రేవంత్ రెడ్డి ప్రతీకారం మానుకొని... పాలనపై దృష్టి సారించాలన్నారు. పదేళ్లలో కేసీఆర్ వందేళ్ల అభివృద్ధి చేస్తే... రేవంత్ వందేళ్లు వెనక్కి తీసుకువెళుతున్నారని మండిపడ్డారు.