by Suryaa Desk | Tue, Nov 12, 2024, 07:18 PM
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్ పదవికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీజీపీఎస్సీకి ప్రస్తుతం మహేందర్ రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబరు 3వ తేదీతో ముగియనుండటంతో.. ఆయన స్థానంలో మరో ఛైర్మన్‌ను నియమించేందుకు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔత్సహికులు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 20న సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తు ఫారం, అర్హతలు, ఇతర వివరాలు www.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పూర్తిచేసిన దరఖాస్తులను దరఖాస్తు గడువులోగా prlsecy-ser-gpm-gad@telangana.gov.in అనే మెయిల్‌కు పంపించాలని స్పష్టం చేసింది.
అయితే.. ఛైర్మన్ నియమక పద్ధతి ఈసారి ఎలా చేపట్టనుందన్నది ఆసక్తికరంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఉన్న టీఎస్పీఎస్సీ బోర్డులో ఉన్న వారిపై పేపర్ లీకేజీ ఆరోపణలు రావటంతో.. అందులో కొందరు అధికారులు రాజీనామాలు చేశారు. ఈ క్రమంలోనే టీజీపీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కార్.. కొత్త బోర్డును పకడ్బందీగా నియమించింది. కాగా.. ఇప్పుడు కొత్త ఛైర్మన్ నియమకాన్ని కూడా అదే పద్ధతిలో నియమించాలని యోచిస్తోంది. టీజీపీఎస్సీ ఛైర్మన్ పదవి కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం నియమించిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి.. నేరుగా ఎంపిక చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో సర్కార్ స్పష్టంగా పేర్కొంది.
కలెక్టర్‌పై దాడి.. 55 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈసారి ఆ ప్రశ్నాపత్రాలు కూడా ముద్రించే..
ఇదిలా ఉంటే.. తెలంగాణలో వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో హిందీ, మఠారీ మీడియాల్లో పరీక్షలు రాసే విద్యార్థులకు ఆయా మాధ్యమాల్లో ముద్రించిన ప్రశ్నాపత్రాలు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్‌బోర్డుకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇప్పటివరకు ఆయా మాధ్యమాలకు చెందిన విద్యార్థులకు చేతిరాతతో రాసి ప్రశ్నాపత్రాలను జిరాక్స్ చేసి ఇచ్చేవారు. కాగా.. ఈసారి ముద్రించి ఇవ్వనున్నట్టు తెలిపారు.
ప్రతి సంవత్సరం హిందీ మాధ్యమంలో 100 మందిలోపు, మరాఠీ మాధ్యమంలో 300 మందిలోపు విద్యార్థులు పరీక్షలు రాసేవారు. దీంతో.. చేతిరాతతో కూడిన ప్రశ్నాపత్రాన్నే జారీ చేసేవారు. అయితే ఈ ఏడాది నుంచి వాళ్లకు కూడా ప్రశ్నాపత్రాలను ముద్రించి ఇవ్వాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. కన్నడ మాధ్యమంలో కూడా సుమారు 50 మంది విద్యార్థులు ఉండగా.. వారికి కూడా ప్రశ్నపత్రాలను ముద్రించే ఇవ్వనున్నారు.