by Suryaa Desk | Tue, Nov 12, 2024, 06:44 PM
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడి ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. పథకం ప్రకారమే కొంతమంది రైతులను రెచ్చగొట్టి కలెక్టర్‌పై భౌతిక దాడికి పాల్పడేలా చేశారని ఆరోపించారు. ఈరోజు ఆయన లగచర్ల ఘటనపై మీడియాతో మాట్లాడుతూ... రైతులను సభాస్థలికి రాకుండా కొంతమంది అడ్డగించారన్నారు. దీంతో రైతుల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుందామని కలెక్టర్ వెళ్లే ప్రయత్నం చేశారని, కానీ దాడి జరిగిందన్నారు.ఈ దాడికి కారకులెవరో... కుట్రదారులెవరో విచారణ చేస్తామన్నారు. అసలు కలెక్టర్‌ను గ్రామంలోకి తీసుకెళ్లింది ఎవరనే విషయమై విచారణ జరిపిస్తామన్నారు. దాడులు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తమకు అధికారం రాలేదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అప్రజాస్వామికంగా రౌడీయిజం, గూండాయిజం చేస్తామంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అధికారం రాలేదనే ఆక్రోశం ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో కనిపిస్తోందన్నారు. అందుకే తాము ఏ సంక్షేమ కార్యక్రమం లేదా అభివృద్ధి కార్యక్రమం మొదలు పెట్టినా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఉద్యోగ కల్పన లక్ష్యంగా తాము ముందుకు సాగుతుంటే... న్యాయపరమైన చిక్కులు తెచ్చే ప్రయత్నం కూడా చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అవరోధాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తోందన్నారు