by Suryaa Desk | Fri, Nov 15, 2024, 07:19 PM
తెలంగాణలో ప్రస్తుతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 6న ఈ సర్వే ప్రక్రియ మొదలవగా.. తొమ్మిదవ తేదీ నుంచి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా.. ప్రభుత్వం కేటాయించిన ఎన్యూమరేటర్లు.. ఆయా ప్రాంతాల్లోని ఇంటింటికీ వెళ్తూ ఆ కుటుంబ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. అయితే.. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సర్వేకు పూర్తిగా సహకరిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అభ్యంతరాలు, ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్యూమరేటర్లు అడిగిన వివరాలు ఇవ్వకుండా.. ఎదురుతిరుగుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యక్తిగత వివరాలను ప్రభుత్వానికి ఎందుకివ్వాలంటూ ఎన్యూమరేటర్లనే తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తుంటే.. ఈ కుటుంబ సర్వేపై సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జరుగుతూ.. జనాలను అయోమయానికి గురి చేస్తున్నాయి.
ఫ్రిజ్లు, టీవీలు, ఏసీలు, కార్లు, ద్విచక్ర వాహనం ఇలా అన్ని వివరాలు వెల్లడిస్తే ప్రస్తుతం వస్తున్న ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయంటూ సోషల్ మీడియాలో కొంత మంది ప్రచారం చేస్తున్నారు. వాటిని చూసిన జనాలు ఎన్యూమరేటర్లకు సహకరించకుండా సర్వే సాఫీగా సాగకుండా అడ్డుకుంటున్నారు. కాగా.. ఈ ప్రచారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తి క్లారిటీ ఇచ్చారు.
సర్వే సమాచారాన్ని ప్రభుత్వమే సేకరించి గోప్యంగా ఉంచుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తమ సమాచారం చెప్పటం వల్ల ఎవరికీ ఏ ప్రభుత్వ పథకాలు నిలిచిపోవని.. అదనంగా మరిన్ని పథకాలు ఇచ్చేందుకే ఈ వివరాలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి వివరించారు. ఈ సర్వే వివరాలు ఏదో రహస్యంగా దాచిపెట్టేవి కావని.. దీనిపై అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా, పారదర్శకంగా ప్రభుత్వం సమాచారం సేకరిస్తుందని పేర్కొన్నారు. ఈ సర్వేకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. మంత్రి వర్గంలో తీర్మానం జరిగిన తర్వాత.. అసెంబ్లీలో ఆమోదించిన తర్వాతే సర్వే చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అంతేకాకుకండా.. ఎన్యూమరేటర్లపై దూషణలకు, దాడులకు దిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
మరోవైపు.. సర్వేలో భాగంగా బ్యాంక్ ఖాతా వివరాలు అడగటంపై వస్తున్న విమర్శలపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ అడగడం లేదని.. కేవలం ఉందా లేదా అన్న విషయం మాత్రమే అడుగుతున్నట్టుగా వివరించారు. బ్యాంక్ ఖాతాకు ఆప్షన్ అడుగుతున్నామని.. ఆధార్ కార్డు కూడా తప్పనిసరి కాదని మంత్రి తేల్చి చెప్పారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయమే జరుగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. దయచేసి అందరూ కులగణన సర్వేకు సహకరించాలని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించినవారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మంత్రి పొన్నం సూచించారు.
తెలంగాణ ప్రజలను భాగస్వాములను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సర్వేతో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఓ దిక్సూచిగా మారనుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 30 శాతం సర్వే జరగ్గా.. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగున్నర లక్షల ఇళ్లకు సర్వే పూర్తయిందని తెలిపారు. రాష్ట్రంలో 85 వేలకుపైగా ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్నారని మంత్రి పొన్నం పేర్కొ్నారు.