by Suryaa Desk | Tue, Nov 12, 2024, 10:27 PM
రాత్రి రెండింటి వరకు కశ్మీర్‌లో ఉన్న ప్రియుడితో ఫోన్ మాట్లాడుతూనే ఉంది. ఉదయం తన స్నేహితుడు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. ఆ కాసేపటికే కశ్నీర్‌లో ఉన్న ఆమె తల్లి నుంచి ఆ స్నేహితునికి ఫోన్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన కూతురి మొబైల్ స్విచ్ఛాఫ్ వస్తుందని ఏమైందో ఒకసారి ఇంటికి వెళ్లి చూసి రమ్మని.. భయంతో వణుకుతున్న గొంతుతో చెప్పింది. వెంటనే ఆమె ఉంటున్న ఇంటికి.. ఆ స్నేహితుడు వెళ్లి పిలిచినా లోపలి నుంచి ఎలాంటి స్పందనా రావట్లేదు. దీంతో.. తలుపులు పగలగొచ్చి చూస్తే.. ఒక్కసారిగా షాక్. ఫ్యాన్ ఊరేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించిన తన స్నేహితురాలిని చూసి.. ఒక్కక్షణం గుండె ఆగినంతపనైంది. ఈ ఘటన హైదరాబాద్ షేక్ పేటలో జరిగింది.
జమ్ము కశ్మీర్‌లోని బారాముల్లా మాలాపోరా ప్రాంతానికి చెందిన ఇరం నబిదార్ (23) హైదరాబాద్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తూ.. షేక్‌పేట గుల్షన్ కాలనీలో ఓ పెంట్ హౌస్‌లో నివాసముంటోంది. అయితే.. నిత్యం ఎంతో ఉల్లాసంగా, తోటి ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటుంది. అయితే.. నవంబర్ 8వ తేదీన నబిదార్‌కు తన స్నేహితుడు అబ్దుల్ ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏమైందో ఏమోలే అని ఊరుకున్నాడు. కానీ.. కాసేపటికే అబ్దుల్‌కి నబిదార్ తల్లి నుంచి ఫోన్ వచ్చింది.
ఒకింత ఆందోళన, ఒకింత భయం కలగలిపిన గొంతుతో మాట్లాడిన ఆమె.. ఎన్నిసార్లు చేసినా తన కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని.. తనకు కొంచెం భయంగా ఉందని.. ఒక్కసారి ఇంటికి వెళ్లి చూసిరమ్మని రిక్వెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే నబీదార్ ఉంటున్న రూమ్‌కి వెళ్లి తలుపు కొట్టాడు. లోపల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.. తలుపు కూడా తెరవలేదు. దీంతో.. ఆందోళన చెందిన అబ్ధుల్.. ఆ ఇంటి వాచ్‌మెన్‌ను పిలిచి.. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కి విగతజీవిగా వేలాడుతూ నబిదార్ కనిపించింది.
ఒక్కసారిగా షాక్ అయిన అబ్ధుల్.. క్షణాల్లోనే తేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకొని.. నబిదార్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే.. నబిదార్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ యువతి ఫోన్ కాల్స్ పరిశీలించగా.. కొంతకాలంగా తన ప్రియుడితో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు కూడా రాత్రి 2 గంటల వరకు కశ్మీర్‌లోని బారాముల్లాలో ఉండే తన ప్రియుడితో మాట్లాడినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రేమ విఫలం కావడం వల్లే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.తమ కూతురికి లవ్ ఎఫైర్ ఉందని, కొంత కాలంగా మానసికంగా బాధపడుతుందని ఆమె కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.