by Suryaa Desk | Fri, Nov 15, 2024, 09:15 PM
ఒక్కసారి ఎమ్మెల్యేగా చేస్తేనే.. పడవల్లాంటి కార్లు, రాజభవనం లాంటి ఇండ్లు, పక్కన ఇద్దరు గన్ మెన్లు.. చుట్టూ పదేసి మంది అనుచరులు కనిపిస్తూ ఒకరకమైన హోదా మెయిన్‌టెన్ చేస్తుంటారు. ఇక వాళ్లు బయట భోజనం చేయాలంటే స్టార్ హోటళ్లకు, ఒంట్లో కొంచెం నలతగా ఉన్నా మల్టీస్పెషాలిటీ హాస్పిటళ్లకు వెళ్తుంటారు. ఎమ్మెల్యే వరకూ ఎందుకండి బాబూ.. వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ, మండల స్థాయి నాయకులే.. నలగని ఖద్దరు చొక్కాలు వేసుకుని దర్పం ప్రదర్శిస్తుంటారు.
అలాంటిది.. ఏకంగా 5 సార్లు (21 ఏళ్లు) ఎమ్మెల్యేగా పని చేసిన నాయకుడు ఎలా ఉంటాడు..? తన ఊర్లో, హైదరాబాద్‌లో కలిపి రెండు మూడు రాజభవనాల్లాంటి ఇండ్లు.. ఇంటి ముందు నాలుగైదు కార్లు.. ఊరిలో పొలాలు, చేతి నిండా పంచాయితీలతో, చుట్టూ ఇరవై ముప్పై మంది జనాలతో ఒక రకమైన వ్యవస్థనే నడిపిస్తుండాలి. కానీ.. ఈ ఎమ్మెల్యే మాత్రం వీటన్నింటికీ భిన్నంగా.. అత్యంత సామాన్యంగా సామాన్యులతో కలిసి కంటి పరీక్ష కోసం క్యూలైన్‌లో నిలబడ్డారు. ఆయన ఎవరో కాదు.. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య.
గుమ్మడి నర్సయ్య ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989, 1999, 2004లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ.. అధికార దర్పానికి, అర్బాటాలకు దూరంగా ఉంటూ.. నీతి, నిజాయితీతో.. సాదాసీదా జీవితాన్ని గడుపున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే తన నిరాడంబర జీవితంతో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పదవిలో ఉన్నంతకాలం బస్సు, ట్రైన్‌లలోనే హైదరాబాద్ వచ్చి విద్యానగర్‌లోని పార్టీ ఆఫీసులో పడుకుని.. ఆటోలో అసెంబ్లీకి వచ్చేవారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నడిపించే ఫుడ్ సెంటర్‌లో రూ.5 భోజనం చేసే గుమ్మడి నర్సయ్య.. ముందు నుంచి పబ్లిసిటీకి, అవినీతికి దూరంగా ఉండేవారు. అందుకే ఆయనకు ఊర్లో కొద్దిపాటి పొలం తప్పా ఆస్తులేమి లేవు.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన గుమ్మడి నర్సయ్య.. తన పదవి కాలంలో తనకు వచ్చిన జీతాన్ని కూడా తన సొంతానికి వాడుకోకుండా మొత్తం పార్టీకే ఇచ్చేవారంటే.. ఆయన ఎంతో నిరాడంబర జీవితాన్ని గడిపారో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఇప్పటికీ సైకిల్ మీద వెళ్తూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటివన్ని ఆయనకు సర్వసాధారణం. ఇదే క్రమంలో.. మరోసారి తన చుట్టూ ఉండే జనాలనే కాకుండా మీడియాను కూడా ఆశ్చర్యానికి గురి చేశారు.
తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం వచ్చిన గుమ్మడి నర్సయ్య.. మాజీ ఎమ్మెల్యే అన్న ప్రోటోకాల్‌కు దూరంగా సామాన్యునిడిగా వ్యవహరించి మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. అందరితో పాటే ఓపీ చీటీ తీసుకుని.. డాక్టర్ గది ముందు క్యూలో నిలుచుని.. తన వంతు వచ్చేవరకు ఓపికగా ఎదుచూసారు. తన వంత వచ్చాక కంటి పరీక్ష చేయించుకుని వెళ్లిపోయారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుమ్మడి నర్సయ్య లాంటి నాయకులు అతికొద్ది మందే ఉంటారని.. అలాంటి నాయకుడి నుంచి నిరాడంబరతను, ఔన్నత్యాన్ని.. ప్రస్తుత నాయకులు నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. కుళ్లూ కుతంత్రాలు స్వార్థం అవినీతితో కంపు రాజకీయాలు చేసే నాయకులకు జై కొట్టేకంటే.. ఇలాంటి నాయకులకు హ్యాట్సాఫ్ చెప్పాలంటూ కామెంట్లు చేస్తున్నారు.