by Suryaa Desk | Tue, Nov 12, 2024, 07:34 PM
అమెరికాలో ఉన్న విదేశీయుల్లో అత్యధికం భారత్ నుంచి వెళ్లిన వారే ఉంటారు. ఇక బిజినెస్‌లు, రాజకీయాలు, ఉద్యోగాలు, చదువు కోసం ప్రతీ సంవత్సరం కొన్ని లక్షల మంది.. అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు. ఈ క్రమంలోనే వారు అమెరికాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కొందరు భారతీయులు.. అమెరికాలో వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో నిలిచిన ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తల్లి కూడా భారతీయురాలే కావడం గమనార్హం. కమలా హారిస్ మాత్రమే కాకుండా ఎంతో మంది భారతీయులు.. అటు రిపబ్లికన్ పార్టీలోనూ, ఇటు డెమోక్రాటిక్ పార్టీలోనూ వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. ఇందులో తెలుగువారు కూడా ఉన్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి కూడా ఆంధ్రప్రదేశ్ వాసి కావడం విశేషం.
ఈ క్రమంలోనే తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం నగరానికి చెందిన రామసహాయం రాధిక.. అమెరికాలోని ఒహాయో రాష్ట్ర మైనార్టీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ అడ్వయిజరీ బోర్డు సలహాదారుగా నియమితులయ్యారు. రామసహాయం రాధిక నియామకానికి సంబంధించి ఒహాయో రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్.. శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 2026 వరకు రామసహాయం రాధిక.. ఒహాయో రాష్ట్ర మైనార్టీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ అడ్వయిజరీ బోర్డు సలహాదారుగా కొనసాగనున్నారు.
ఖమ్మంకు చెందిన రామసహాయం బుచ్చిరెడ్డి, నిర్మల దంపతుల కుమార్తె రామసహాయం రాధిక.. ప్రస్తుతం అమెరికాలోని కొలంబస్‌లో ఉంటూ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఈ పదవి దక్కింది. ఈ విషయాన్ని రామసహాయం రాధిక తండ్రి బుచ్చిరెడ్డి తెలిపారు. రామసహాయం రాధికకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన కొండకింద వీరారెడ్డి కుమారుడు రఘురాంరెడ్డితో 2006లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత భర్తతో కలిసి రాధిక అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
అమెరికాలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా చేరి.. క్రమక్రమంగా ఎదిగి అదే కంపెనీలో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. ఇక 2009 నుంచి వివిధ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తున్న రామసహాయం రాధికకు ఈ అవకాశం వచ్చిందని తండ్రి బుచ్చిరెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె చేసిన సేవా కార్యక్రమాలకు గానూ రాధికకు ఈ పదవి దక్కిందని ఆయన వెల్లడించారు.