by Suryaa Desk | Fri, Nov 15, 2024, 07:40 PM
రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ కూడళ్ల వద్ద ట్రాన్స్‌జెండర్లు డబ్బులు అడగటం.. హైదరాబాద్ వాసులకు ఎప్పుడో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. రైళ్లలోనూ ట్రాన్స్‌జెండర్లు చప్పట్లు కొడుతూ.. ప్రయాణికుల దగ్గర్నుంచి డబ్బులు అడుగుతుంటారు. దీంతో సమాజంలో వారి పట్ల చీత్కార భావం నెలకొంది. చాలా మంది ట్రాన్స్‌జెండర్లకు అలా చేయడం ఇష్టం లేకపోయినా సరే.. సంపాదనకు మరో మార్గం లేకపోవడంతో.. పూట గడవటం కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా చేస్తుంటారు. ఎవరూ ఉద్యోగం ఇవ్వకపోవడం, పెద్దగా చదువుకునే అవకాశాలు లేకపోవడంతో ట్రాన్స్‌జెండర్లు విధిలేని పరిస్థితుల్లో రోడ్ల వెంబడి, రైళ్లలో యాచిస్తూ ఉంటారు.
ఇలాంటి దుర్భర జీవితాన్ని గడుపుతోన్న ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కూడళ్ల వద్ద వారు కనిపిస్తే.. మీరు చీదరించుకునే బదులు.. వారి సూచనలు పాటిస్తే సరిపోతుంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ట్రాన్స్‌జెండర్ల సేవలను వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడమే దీనికి కారణం. హోంగార్డుల తరహాలో వీరి సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిని గుర్తించేందుకు, సిగ్నల్ జంప్ చేయకుండా ఆపడానికి, వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా చూసేందుకు ట్రాన్స్‌జెండర్ల సేవలను ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వీరికి ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ రూపొందించి.. హోంగార్డుల తరహాలో జీతభత్యాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సెప్టెంబర్లోనే సీఎం ఈ తరహా ప్రతిపాదన చేయగా.. ఇప్పుడు మరోసారి అధికారులను ఆదేశించడంతో.. త్వరలోనే ట్రాన్స్‌జెండర్ల సేవలను వినియోగించుకునే విషయంలో అధికారులు కార్యచరణను రూపొందించే అవకాశం ఉంది.
ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను ఉపయోగించుకోవడం ద్వారా.. వారికి జీవనోపాధి లభించడంతోపాటు.. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ట్రాన్స్‌జెండర్లు తిడితే మంచిది కాదనే భావన సమాజంలో ఉంది. దీంతో వారు డ్యూటీలో ఉన్న సమయంలో.. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. ట్రాఫిక్ పోలీసులపైనా పనిభారం తగ్గుతుంది. ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన, అవసరమైన శిక్షణ ఇచ్చి.. ట్రాన్స్‌జెండర్లను విధుల్లోకి తీసుకుంటే.. అన్నిరకాలుగా ప్రయోజనకరంగా ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.
తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది జులైలో ట్రాన్స్‌జెండర్ల కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో ప్రత్యేక క్లీనిక్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందే వరంగల్‌లో వారి కోసం ప్రత్యేక క్లీనిక్‌ను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వారు ప్రత్యేకంగా వైద్య సేవలు పొందే అవకాశం ఉంది.