by Suryaa Desk | Fri, Nov 15, 2024, 07:38 PM
తన వివాహేతర సంబంధం గురించి ఆడపడుచుకు తెలియడంతో.. అది ఎక్కడ బయటపెట్టేస్తుందోనని ఆమెపైనే నిందలు వేసింది. తన ఇంటి పక్కనే ఉన్న యువకుడితో అక్రమ సంబంధం అంటగట్టింది. తనకు అన్నలాంటి వాడని ఆమె ఎంతగా మొత్తుకున్నా ఆమెను వీధిలోకి లాగింది. అంతటితో ఆగకుండా తన ప్రియుడ్ని కూడా రంగంలోకి దింపి.. అతడి ద్వారా మొబైల్‌కు మెసేజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేసింది. వదిన ఆడిన నాటకంలో యువతి బలిపశువైంది. చివరకు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడింది. ఇది బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 11న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని స్రవంతి కేసులో బయటపడిన నిజం.
అన్న భార్య(వదిన) శైలజ వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో శైలజ, ఆమె ప్రియుడు నవీన్‌ను అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌కు చెందిన విఠల్ కుమార్తె స్రవంతి (19) నవంబరు 11 ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. అయితే, తమ పక్కింటిలో ఉండే ఓ యువకుడి వేధింపులతోనే స్రవంతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశాడు. దీంతో నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో స్రవంతి సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. ఆమెకు మెసేజ్‌లు వచ్చిన ఫోన్ నెంబరు.. పక్కంటి యువకుడుది కాదని వెల్లడయ్యింది.
అది యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లో ఉంటున్న నవీన్‌కుమార్ అనే వ్యక్తి మొబైల్ నెంబరుగా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. స్రవంతి వదిన శైలజ, నవీన్‌లకు ముందే సంబంధం ఉన్నట్లు తేలింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు దూరంగా ఉన్న ఇరువురూ ఇటీవల మళ్లీ కలవడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని స్రవంతి గుర్తించడంతో తమ సంబంధం ఎక్కడ బయటపడుతుందోనని శైలజ భావించింది. దీంతో ఆడపడుచుపైనే అబాండాలు వేసింది. ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడితో సంబంధం ఉందని వేధింపులకు గురిచేసింది.
అతడు తనకు సోదరుడి లాంటివాడని చెప్పినా వినిపించుకోకుండా భర్త, అత్తమామలకు నూరిపోసింది. ఆమె మోసం గురించి తెలియని వాళ్లు కూడా స్రవంతిని అనుమానించసాగారు. తన ప్రియుడు నవీన్‌ను రంగంలోకి దించి అతడి ద్వారా స్రవంతి ఫోన్‌కు మెసేజ్‌లు పంపేందుకు కుట్రలు చేసింది. శైలజ, నవీన్‌కుమార్‌లు పెట్టే వేధింపులు తట్టుకోలేక స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. చివరకు కోడలే తమ కుమార్తె చావుకు కారణమైనట్లు పోలీసుల విచారణలో బయటపడటంతో స్రవంతి తల్లిదండ్రులు షాక్‌లోకి వెళ్లిపోయారు. శైలజతో పాటు నవీన్‌కుమార్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.