by Suryaa Desk | Fri, Nov 15, 2024, 07:07 PM
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సికింద్రాబాద్ టూ లక్నో స్పెషల్ రైలు సర్వీసును ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు (నవంబర్ 15న) మళ్లీ తిరిగి శుక్రవారం (నవంబర్ 22న) ఈ స్పెషల్ ట్రైన్ సర్వీసును నడపనున్నట్లు అధికారులు వెళ్లడించారు. ఈ ప్రత్యేక రైలు.. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మీదుగా లక్నో చేరుకోనుంది. అయితే.. తెలంగాణ, ఏపీలోని ఏ ఏ స్టేషన్‌లలో ఈ స్పెషల్ ట్రైన్ ఆగనుందన్నది దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్ టూ లక్నో రూట్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ స్పెషల్ ట్రైన్ సర్వీసును ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
అయితే.. సికింద్రాబాద్ నుంచి లక్నో వరకు నడవనున్న ఈ స్పెషల్ రైలు (07084 ) శుక్రవారం (నవంబర్ 15న) రాత్రి 7 గంటల 05 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి.. ఆదివారం (నవంబర్ 17న) సాయంత్రం 6 గంటలకు లక్నో చేరుకోనుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే.. ఇదే స్పెషల్ సర్వీసు నవంబర్ 18, 25 తేదీల్లో లక్నో నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. సోమవారం (నవంబర్ 18న) ఉదయం 9 గంటల 50 నిమిషాలకు లక్నో స్టేషన్ నుంచి బయలుదేరి బుధవారం (నవంబర్ 20 న) సాయంత్రం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుటుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. సికింద్రాబాద్ నుంచి లక్నోకు నడిచే ఈ స్పెషల్ ట్రైన్.. ఏపీ, తెలంగాణలోని ఏ ఏ స్టేషన్లలో ఆగుతుందన్న వివరాలు కూడా అధికారులు వెల్లడించారు. కాగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బయలుదేరే ఈ ట్రైన్.. తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్‌లలో ఆగనుండగా.. ఏపీలోని గుంటూరు, విజయవాడ, దువ్వాడ, విజయనగరం స్టేషన్‌లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. ఇక అక్కడి నుంచి.. భువనేశ్వర్, కటక్, గయా, వారణాసి, అయోధ్య స్టేషన్లలో ఆగుతూ.. లక్నో చేరుకోనుంది ఈ స్పెషల్ ట్రైన్. అయితే.. ఈ రైళ్లల్లో 3 ఏసీ కోచులు కూడా ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది.
అయితే.. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్ సర్వీసులు నడిపిస్తున్న విషయం తెలిసిందే. పండుగల వేళ ప్రయాణికుల రద్దీతో పాటు ప్రత్యేక సందర్భాలలో కూడా అవసరమైన మార్గాల్లో స్పెషల్ ట్రైన్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే.. శబరిమలకు తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తెలుగు భక్తులు వెళ్లనున్న నేపథ్యంలో.. ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. సికింద్రాబాద్ నుంచి లక్నోకు వెళ్లే ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది రైల్వే శాఖ.