by Suryaa Desk | Tue, Nov 12, 2024, 08:04 PM
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని నిరసిస్తూ బీజేపీ తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు 420 ఇతర హామీలు ఇచ్చిందని... ఈ హామీలు అమలు చేయడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేపట్టి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించింది. అదే సమయంలో ఈ నెల 15వ తేదీన లేదా 16వ తేదీన మూసీ పరీవాహక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో బస చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. మూసీ ప్రాంతంలో బస చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో రాత్రివేళ అక్కడ బస చేయనున్నారు.