by Suryaa Desk | Wed, Nov 13, 2024, 09:04 PM
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట కేంద్రీకృతమై ఉందని దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు కొన్ని జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. నేడు రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రానికి చల్లబడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలోని వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయన్నారు.
ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ నైరుతి దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా తీరాల వెంట కేంద్రీకృతమైందన్నారు. నేడు బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, శ్రీ సత్యసాయి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు.
తెలంగాణలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొన్ని చోట్ల 15 డిగ్రీలకు దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మెదక్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో 14 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గరిష్ఠంగా ఖమ్మంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్ లో 33.4 డిగ్రీలు నమోదైంది. ఇక వర్ష సూచనతో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నదాతలకు వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నారు.