by Suryaa Desk | Tue, Nov 12, 2024, 04:06 PM
ఎన్యుమరేటర్ల సంఖ్యను పెంచి, ఎన్యూమరేటర్ల ఇండ్ల సంఖ్యను తగ్గించాలని పీఆర్ టియు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మాణయ్య ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్‌టీయుS సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎ.మాణయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.ప్రభు, జిల్లా గౌరవాధ్యక్షుడు తులసీరాం రాథోడ్‌లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వే చేయడంలో ఎన్యుమరేటర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సర్వే నిర్ణీత సమయంలో పూర్తయ్యే అవకాశం లేనందున గడువు పొడగించాలన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 75 అంశాలతో కూడిన ప్రశ్నావళికి సమాచారం సేకరించడానికి 45 నిమిషాలకుపైగా సమయం పడుతుందని, అదేవిధంగా సరైన ప్రచారం లేని కారణంగా కుటుంబాల యజమానులు ఇండ్లలో అందుబాటులో ఉండడం లేదని, ఉన్నా కూడా కొందరు సరిగా స్పందించడం లేదని, మధ్యాహ్నం, సాయంత్రం వేళలో సర్వే చేయడంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని,ఉదయం పూట సర్వే చేసేట్లు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని పర్యవేక్షణ అధికారుల ఒత్తిడి సరికాదని అనారోగ్యం కారణంగా సర్వే విధులకు హాజరు కాని ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎన్యూమరేటర్ సర్వే చేస్తున్న కుటుంబాల సంఖ్య ఆధారంగా రెమ్యునరేషన్ చెల్లించాలని పీఆర్‌టీయు తరపున కోరుతున్నట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు ఒంటి పూట నడపటం వల్ల రాబోయే రోజుల్లో పిల్లల ఎన్రోల్ మెంట్ పై ప్రభావం పడే అవకాశం ఉందని పాఠశాలలు రెండు పూటలా నడిచే విధంగా సర్వేకు ప్రత్యామ్నాయ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.