by Suryaa Desk | Wed, Nov 13, 2024, 03:22 PM
లగచర్ల ఘటన సమయంలో నిందితుడు సురేశ్‌తో మాజీ ఎమ్మెల్యే ఒకరు (పట్నం నరేందర్ రెడ్డి) 42 సార్లు మాట్లాడినట్లుగా తెలిసిందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మాట్లాడినట్లు కూడా ఫోన్ రికార్డింగ్ ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ... దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.గతంలో ఎస్సీల భూములు లాక్కుంటే ఈ తరహా దాడులు చేయలేదన్నారు. మల్లన్న సాగర్ సహా పలు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ జరిగినప్పుడు తాము కూడా ఇలాగే అడ్డుకుంటే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మాటలు విని దాడులకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరించారు.వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ మంత్రి ఆదేశాలతోనే లగచర్లలో ఈ అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగిందన్నారు. గతంలో రేసింగ్ ఈవెంట్ నిర్వహించినప్పుడు విదేశీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని ఆరోపించారు.కలెక్టర్ వెళ్లింది ప్రజాభిప్రాయ సేకరణ కోసమేని... రైతులు అందరూ కలిసి వద్దంటే అక్కడ పరిశ్రమను పెట్టరని స్పష్టం చేశారు. ఈ ఘటనలో కాల్ డేటాను, వాట్సాప్ కాల్ సందేశాలను కూపీ లాగుతామన్నారు. ధాన్యం సేకరణపై మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు ప్రక్రియ కాస్త ఆలస్యమైందన్నారు. వారం రోజుల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.