by Suryaa Desk | Wed, Nov 13, 2024, 07:17 PM
ప్రస్తుతం సమాజంలో సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తున్న ఘటనలు నిత్యం మన కళ్లముందే జరుగుతున్నా.. అవి మాత్రం ఆగడం లేదు. పెళ్లి అయినవారు.. భాగస్వాములను కాదని.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధాలు కలిగి ఉండటం.. కాపురాలనే కాకుండా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటన మరింత కలవరపాటుకు గురి చేస్తోంది.
ఓ వ్యక్తికి పెళ్లి అయింది. భార్యతో కలిసి జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను ఇంటికి తీసుకువచ్చి సహజీవనం కూడా చేస్తున్నాడు. ఒకే ఇంట్లోనే అటు భార్య, ఇటు ప్రియురాలితో కలిసి ఆ వ్యక్తి సంసారం సాగించాడు. ఈ క్రమంలోనే ప్రియురాలితో గొడవలు ప్రారంభం అయ్యాయి. దీంతో విసిగిపోయిన ఆ వ్యక్తి.. ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా ప్రియురాలి శవాన్ని తీసుకెళ్లి.. పత్తి చేనులో పాతిపెట్టాడు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూడటం గమనార్హం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో స్వాతి అనే యువతి హత్యకు గురైంది. స్వాతిని ఆమె ప్రియుడు వీరభద్రం చంపినట్లు తేలింది. మణుగూరు మండలం తోగ్గుడేనికి చెందిన స్వాతి(32).. గత 6 ఏళ్లుగా వీరభద్రంతో సహజీవనం చేస్తోంది. అప్పటినుంచి మాచినేనిపేట తండాలోనే వీరభద్రం ఇంట్లోనే నివసిస్తోంది. అదే ఇంట్లో వీరభద్రం.. తన భార్యతో పాటు స్వాతితో కలిసి ఉంటున్నాడు. అయితే భార్య నుంచి ఎలాంటి అడ్డూ లేకపోయేసరికి వీరభద్రం, స్వాతి సంతోషంగానే ఉన్నారు.
అయితే గత కొన్ని రోజుల నుంచి స్వాతి, వీరభద్రం మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. కుటుంబ తగాదాలు, ఆర్థిక లావాదేవీలతోపాటు వివిధ కేసుల్లో వీరభద్రం నిందితుడిగా ఉండటంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తీవ్రంగా విసిగిపోయిన వీరభద్రం.. ఎలాగైనా స్వాతిని అడ్డుతొలగించుకోవాలని భావించాడు. దీంతో ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ఈనెల 9వ తేదీన తన ఇంట్లోనే స్వాతిని అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత స్వాతి మృతదేహాన్ని సమీపంలోని తన పొలంలో ఉన్న పత్తి చేనులో గొయ్యి తీసి పాతిపెట్టాడు.
అయితే స్వాతి చనిపోయిన విషయం 3 రోజుల తర్వాత తెలిసింది. దీంతో స్థానికులు పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కొత్తగూడెం డీఎస్పీ, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాణా ప్రతాప్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రెవెన్యూ అధికారులు, పోలీసుల.. స్వాతి మృతదేహాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.